వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి… తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిల్చిపోయే పేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు దఫాలుగా 2004 నుండి 2009 వరకు పనిచేసిన ఆయన ప్రజల మనసును గెల్చుకున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నాటి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలను పాదయాత్రద్వారా చుట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చిన వైఎస్ఆర్ 2009లో రెండో దఫా కూడా అధికారంలోకి రాగలిగారు. ఐక్యంగా పోటీచేసిన బలమైన విపక్షాన్ని తట్టుకుని కాంగ్రెస్ పార్టీని రెండో సారి అధికారంలోకి తీసుకుని వచ్చిన ఘనత ఆయనకే సొంతం. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫిజ్ రియంబర్స్ మెంట్ లాంటి పథకాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైఎస్ఆర్ రాజకీయాల్లో మడపతిప్పని నేతగా పేరు తెచ్చుకున్నారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం ఆయన సొంతం. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని దైర్యంతో ముందుకు సాగిన వైఎస్ఆర్ ధైర్యాన్ని రాజకీయ ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటారు.
తాను అనుకున్నది సాధించుకునే క్రమంలో దేనికైనా తెగించే నైజం ఆయన సొంతం. తన ఆప్తులకు సాయం చేయడంలో వైఎస్ కు ఎవరూ సాటిరారని చెప్తారు. వైఎస్ పై రాజకీయాంగా, వ్యత్తిగతంగా ఎన్ని విమర్శలు ఆరోపణలు ఉన్నా నమ్ముకున్న వారికి మేలు చేసే ఆయన తత్వాన్ని మాత్రం రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. వైఎస్ ను ఆరాధించే వారు ఎంత మంది ఉన్నారో ఆయన్ను వ్యతిరేకించేవారు అంతే మంది ఉన్నారు. ఏది ఏమైనా వైఎస్ ముద్ర మాత్రం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూనే ఉంది.
(వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా)