పోన్ల ద్వారా వేధింపులకు గురయ్యే మహిళలు 78శాతం

మొబైల్ వినియోగం ఇప్పుడు అత్యంత సాధారణంగా మారింది. మొబైల్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇప్పుడు ఇదే మొబైల్ ఫోన్ మహిళలను వేధించే సాధనంగా మారింది. అనవసర ఫోన్లు చేసి వేధించేవారు, సంబంధంలేని మెసేజ్ లు పంపేవారు, ఫొటోలు పంపేవారు ఇట్లా రకరకాలుగా మహిళల ఫోన్ల నంబర్లను తెలుసుకుని వారిని వేధింపులకు గురిచేయడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత దేశంలోని ప్రతీ 100 మంది మహిళల్లో 78 మంది ఇటువంటి వేధింపులకు గురవుతున్నట్టు చెప్పడం గమనార్హం. తమను వేధింపులకు గురిచేస్తున్న వారిలో తెలిసిన వారితో పాటుగా తెలియని వారు కూడా ఉంటున్నట్టు మహిళలు పేర్కొన్నారు. దేశంలోని 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతుల నుండి ఈ సమాచారాన్ని సేకరించారు.
తమకు పెద్ద సంఖ్యలో అనవసర కాల్స్ వస్తుంటాయని మహిళలు ఫిర్యాదు చేసినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. తమకు వస్తున్న కాల్స్ లో లైంగిక వేధింపులకు సంబంధించిన కాల్స్ వస్తున్నట్టు ప్రతీ ముగ్గురిలో ఒక చెప్పారు. అసభ్య సందేశాలతో పాటుగా ఫొటోలు, వీడియోలను కూడా గుర్తు తెలియని నంబర్ల నుండి వస్తున్నట్టు మహిళలు చెప్తున్నారు. తమకు వస్తున్న కాల్స్ లేదా మెసేజ్ లకు సంబంధించి అధికశాతం మంది సదరు నెంబర్ ను బ్లాక్ చేయడంతో ఆగిపోతున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుండి ఒకటికి రెండు సార్లు కాల్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదని మహిళలు పేర్కొన్నారు.
ఫోన్ల ద్వారా లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో పోలీసులను ఆశ్రయిస్తున్న వారు కేవలం 10 శాతం మంది కూడా లేరు. ఇది ఆకతాయిలకు మరింత బలం ఇచ్చేదిగా ఉంది. పోలీసులను ఆశ్రయించడంలో ఉన్న ఇబ్బందులు, కుటుంబం నుండి వచ్చే మద్దతు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే కేవలం పది శాతం కన్నా తక్కువ మంది మాత్రమే తమ పై జరుగుతున్న లైంగిక వేధింపులను గురించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఫోన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి పోలీసులను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ శాతం మహిళలు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ వ్యవహారాలకు సంబంధించి పోలీసుల వద్దకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళల ఫోన్ నంబర్లకు సంబంధించిన డేటాను విక్రయించే వారు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మహిళ ఫోన్ నెంబర్లను సంపాదించి వాటిని ఆకతాయిలకు విక్రయిస్తున్న వారుకూడా లేకపోలేదు. మహిళలు ముందుకు వచ్చి అటువంటి వారిపై ఫిర్యాదు చేస్తేనే మరింత మంది మహిళలు వారి బారిన పడకుండా ఉంటారు.google-site-verification: google7f3ca7ca0a2c3e04.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *