తెలుగు రాష్ట్రాల నేతల్లో… ఢిల్లీలో చక్రం తిప్పేదెవరు…

ఢిల్లీలోని ఎర్రకోటలో పాగావేసేందుకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల లోక్ సభ స్థానాలు అత్యంత కీలకంగా మారాయి. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి… పూర్వవైభవాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రతీ లోక్ సభ స్థానం కూడా అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలో వివిధ సమీకరణాల దృష్యా తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాలే కీలకం కానున్నాయి. అందుకే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికంగా సీట్లను సంపాదించుకోవడం ద్వారా ఢిల్లీ గద్దేపై తమ అనుకూల పార్టీలను కూర్చోపెట్టడంతో పాటుగా వారిని శాసించే స్థితికి చేరుకోవాలని ఆశపడుతున్నాయి.
2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానకారణం ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెల్చిన పార్లమెంటు స్థానాలే అనేది జగమెరిగిన సత్యం. వై.ఎస్. జమానాలో నాటి అభివక్త ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సంపాదించుకుని కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టిపెట్టింది ఏపీ మాత్రమే. ప్రస్తుతం కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీ స్థానాలపై అన్ని పార్టీలు గంపెడు ఆశాలు పెట్టుకుని ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కు గానీ పూర్తి మెజార్టీ రాదనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాలు మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను హైదరాబాద్ స్థానాన్ని మినహా మిగతా 16 సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాలం కలిసి వస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తమ వంతు పాత్రను పోషించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు మెజార్టీకి అవసరమైన సీట్లు రాని పక్షంలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో తమది కీలక పాత్ర అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే చెప్తున్నారు. తృతీయ ఫ్రంట్ కు అవకాశం లేని పక్షంలో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే మద్దతును ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులతో దండుకోవాలనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
తెలంగాణ నుండి కనీసం కొన్ని సీట్లయినా గెలవడం ద్వారా రాష్ట్రంలో పట్టును కోల్పోకుండా ఉండడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తమ వంతు సహకారం అందించాలని బీజేపీ, కాంగ్రెస్ ల రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం వద్ద తమ పరపతి పోకుండా జాగ్రత్త పడేందుకు రెండు పార్టీల స్థానిక నాకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఏపీలోఉన్న 25 లోక్ సభ స్థానాల్లో అత్యధిక సీట్లను గెల్చుకోవడం ద్వారా కేంద్రంలో మరోసారి చక్రం తిప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేక చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్న బాబు బీజేపీని నిలువరించాలంటే రాష్ట్రం నుండి ఆ పార్టీకి మద్దతు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే అది తనకు ఖచ్చితంగా మైనస్ అవుతుందని బాబు గట్టిగా నమ్ముతున్నారు. ఒక వేళ కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీలు ఉంటే పార్టీ బాణిని ఢిల్లీలో బలంగా వినిపించే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది.
ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కేంద్రంలో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని దారులను తెరిచే ఉంచుకుంది. టీఆర్ఎస్ తో ఇప్పటికే దోస్తీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అవసరం అయిన పక్షంలో తప్పకుండా బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తనకు ఇబ్బందులు లేకుండా జగన్ ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ప్రత్యేక హోదా హామీతో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి మూడు ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పాలని కలలు కంటున్నాయి.