విరాట్ కోహ్లీకి దేశభక్తిలేదు- బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఇటలీలో పెళ్లి చేసుకున్న విరాట్ కు దేశం అంటే అభిమానం లేదంటూ ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత్ లో పేరు ప్రఖ్యాతలతో పాటుగా ఐశ్వర్యం సంపాదించుకున్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు తమ పెళ్లికి మాత్రం ఇటలీని వేదికగా ఎంచుకోవడం ఏమిటని మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఇటలీలో పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు దేశభక్తి లేదని విరాట్ కోహ్లీ దంపతులు నిరూపించుకున్నారంటూ సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సీతా-రాములు, రాధా-కృష్ణలు భారత్ లోనే పెళ్లి చేసుకున్నారని అటువంటిది విరాట్ మాత్రం విదేశాల్లో పెళ్లి చేసుకున్నారంటూ ఆయన మాట్లాడుతుంటే అవాక్కవడం అక్కడికి వచ్చిన వారి వంతయింది.
సీతా-రాముడికి క్రికెటర్ కు పోలిక పెట్టడం ఏమిటని ప్రశ్నించిన వారిపై సదరు ఎమ్మెల్యే చిర్రుబుర్రు లాడారు. భారత్ లోని అభిమానుల వల్లే వాళ్లకి ఇంత పేరు వచ్చిందని వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు అన్నీ భారత అభిమానుల వల్లే వచ్చాయని అట్లాంటిది భారత్ ను వదిలి విదేశాల్లో పెళ్లి చేసుకోవడం దారుణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.