విజయ్ ఆత్మహత్య కేసులో తప్పేవరిది…

సినీ హాస్యనటుడు విజయ్ సాయి మృత దేహం పోస్ట్ మార్టం అనంతరం అతనికి నివాసానికి తీసుకుని వచ్చారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడగా ఆయన మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. విజయ్ సాయి భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు సినీ నటులు విజయ్ బౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆత్మహత్యకు ముందు విజయ్ తీసిన సెల్ఫీ వీడియోలో భార్య వనిత తో పాటుగా ఓ లాయర్, పారిశ్రామిక వేత్త పై ఆరోపణలు చేశాడు. తన కుమారుడి ఆత్మహత్యకు అతని భార్యే కారణమని విజయ్ తండ్రి ఆరోపిస్తుండగా ఆమె మాత్రం తనకు ఎటువంటి పాపం తెలియదని అంటోంది. విజయ్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తనకు తెలియదని తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అంటోంది. విజయ్ సెల్ఫీ వీడియోపై కూడా అనుమానం వ్యక్తం చేసిన ఆమె గతంలో విజయ్ తండ్రి తనతో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో టేపులను బయట పెట్టింది.
విజయ్ సాయి ఆత్మహత్య తరువాత బయటకు వస్తున్న ఆడియో టేపులతో ఈ ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతోంది. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.