బోటు ప్రమాదంపై సిగ్గులేని వాదనలు…

విజయవాడ పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు నీటిలో కలిసిపోవడానికి కారణం ఎవరు…? వాటాల కోసం కళ్లుమూసుకున్న పర్యాటక శాఖ అధికారులదా… తమకే పట్టనట్టు వ్యవహరించిన జలవనరుల శాఖదా…తమ పరిధి కాదంటూ తప్పించుకుతిరిగిన జిల్లా యంత్రాంగానిదా… తప్పు ఎవరిదైనా 21 మంది నిండు ప్రాణాలు కృష్ణలో కలిసిపోయాయి. జరిగిన ఘోరం ఎటూ జరిగిపోయింది… భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరక్కుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా జరిగిన దారుణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై జరుగుతున్న రాజకీయ రచ్చ జుగుప్స కలిగిస్తోంది. పడవ ప్రమాదంపై ఒక టీవీ కార్యక్రంలో జరిగిన చర్చలో పాల్గొన్న ఒక పెద్ద మనిషి తప్పంతా పర్యాటకులదే అన్నట్టు మాట్లాడడం విడ్డూరం కలిగిస్తోంది. బోటు ఎక్కే ముందు పడవ నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని యాత్రికులు గమనించలేదని యాత్రికులు బోటు నడిపే వ్యక్తి లైసెన్స్ అడిగి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదంటూ చేసిన వాదన ఘోరాతి ఘోరం…
ఆయనగారు సెలవిచ్చిన దాని ప్రకారం విమానం ఎక్కే ముందు ప్రతీ ప్రయాణికుడు పైలెట్ కు లైసెన్స్ ఉందా..లేదా అనే విషయాన్ని చెక్ చేయాలేమో… బస్సు ఎక్కిన ప్రతీ సారి బస్ డ్రైవర్ లైసెన్స్ అడిగి తీసుకోవాలా..? కనీస ఇంగింతం లేకుండా టీవీ షోల్లో మాట్లాడుతున్న వారిని ఏమనాలి. ప్రభుత్వం తరపు వకాల్తా పుచ్చుకున్న పెద్ద మనిషి చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలకు అంతేలేదా..? కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అడుగడునా నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం జరిగింది. కాసులకోసం పోటీలు పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న వ్యక్తులకు కొందరు ప్రభుత్వ పెద్ద సహకారం ఉందనేది బహిరంగ రహస్యమే. దారుణం జరిగిన తరువాత కారణాలను వెతుక్కోవడం కంటే ఇటువంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *