ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ భేటి

తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసీఆర్ ను పవన్ ఎందుకు కలిశారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవడంలో ఎటువంటి తప్పు లేకున్నా బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుందని చెప్పడం విడ్డూరంగా ఉందని వారంటున్నారు. ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చి గంటకు పైగా వేచి ఉండి మరీ ముఖ్యమంత్రిని కలవడం వెనుక అసలు విషయం ఏమిటో బయటకు చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ తో లోపాయకారి ఒప్పందం చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ ఆయన్ని కలిశాడని ఆరోపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు తెలంగాణ విషయంలో ఎటువంటి అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క యూనిట్ విద్యుత్ ను కూడా అదనంగా ఉత్పత్తి చేయడం లేదన్నారు. మరి ఏంచూపి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంశిస్తున్నారో చెప్పాలన్నారు. అటు మరో కాంగ్రెస్ నేత వీహెచ్ మాత్రం పవన్ కళ్యాణ్ పై విరుచుకుని పడ్డారు. డ్రగ్ కేసు నుండి సినీ పరిశ్రమలోని పెద్దలను రక్షించేందుకే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను కలిశారని అన్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో చాలా మంది పెద్ద తలకాయల పేర్లు బయటికి వచ్చాయని అయితే కొద్ది రోజులకే ఆవిషయం ఎందుకు సద్దుమణిగిందో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.