అమెరికా నుండి 5లక్షల మంది వెనక్కి?

అమెరికా ప్రభుత్వం తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న హెచ్1-బీ విసాల సవరణల వల్ల దాదాపుగా 5 లక్షల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. తొలుత సుమారు 70వేల మందిపై కొత్త నిబంధనల ప్రభావం పడుతుందని భావించినా ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరుగుతోంది. సుమారు 5 లక్షల మందిపై సవరణల ప్రభావం పడుతుందని వారంతా భారత్ కు తిరిగి వచ్చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. హెచ్1-బీ విసాలపై అమెరికా వెళ్లిన వారికి మూడు సంవత్సరాల కాల పరిమితికి విసాను మంజూరు చేస్తారు. అటు తర్వాత మరో మూడు సంవత్సరాల వలకు పొడిగింపు ఉంటుంది. ఇదే సమయంలోనే అమెరికాలో శాశ్వతనివాసులుగా ఉండేందుకు గాను గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసిన తరువాత అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నంత కాలం వారి వీసాలను పొడిగిస్తూనే ఉంటారు. ఇది ఇప్పటివరకు ఉన్న నిబంధన.
కొత్తగా తీసుకుని రానున్న సవరణల ప్రకారం గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న తరువాత అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నవారి వీసాలను పునరుద్దరించరు. దీని వల్ల వారి వీసా కాలపరిమితి తీరడంతో అట్లాంటి వారంతా తిరిగి స్వదేశానికి రాక తప్పని పరిస్థితి. ఇటువంటి వారు సుమారు 5 లక్షల మంది దాకా ఉంటారని నిపుణులు అంచానావేస్తున్నారు. అమెరికా సర్కారు తీసుకుని వచ్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల అమెరికాలోని భారతీయులే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *