ఉత్తర ద్వార దర్శన భాగ్యంకలిగించిన కరిగిరి వేంకటేశ్వరుడు

ఉప్పల్ స్వరూప్ నగర్ లోని ప్రముఖ దేవాలయం శ్రీ కరిగిరి వేంకటేశ్వర ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. తెల్లవారు ఝామునుండే ఆలయ ప్రాగణం కిక్కిరిసిపోయింది. చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముక్కోటి రోజును ముక్కోటి దేవలతో పాటుగా స్వామివారిని దర్శించుకుని భక్త కోటి తరించారు. స్వామివారి పల్లకీ సేవ శోభాయమానంగా జరిగింది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం అటు భక్తులు కూడా గంటల తరబడి ఓపిగ్గా క్యూలైన్లలో వేచిఉండి ఆ దేవదేవుని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస కందాడై, గోమఠం శ్రీనాధ్ లు ఆలయంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోగా ప్రధాన అర్చకులు వేంకటాచార్యులు, శ్రీనివాసా చార్యులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. పలువురు వాలెంటీర్లు విరామం ఎరుకకుండా బాధ్యతలు నిర్వహించి భక్తుల ప్రశంశలను అందుకున్నారు.