ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం- చిన్నారి మృతి

హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారి చనిపోగా ఆమె తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఉప్పల్ స్వరూప్ నగర్ కు చెందిన భూమిక నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ లో చదువుతోంది. భూమిక తల్లి చిన్నారిని స్కూల్ లు తీసుకుని వెళ్తున్న క్రమంలో చిలుకానగర్ వద్ద వెనుక నుండి వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొనడంతో భూమిక ఘటనా స్థలంలోనే చనిపోగా స్కూటిని నడుపుతున్న భూమిక తల్లి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వీరు నివాసం ఉంటుంన్న స్వరూప్ నగర్ కు కొద్ది దూరంలోనే ప్రమాదం జరగడంతో వెంటనే కాలనీవాసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులతో పాటుగా కాలనీ వాసులు కంటతడి పెట్టారు. స్కూల్ వెళ్లడానికి బయలుదేరిని చిన్నారి విగగజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.