టీఆర్ఎస్ లో చేరనున్న ఉమా మాధవరెడ్డి

తెలుగుదేశం నుండి మరో పెద్ద నేత టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాస గృహంతో తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ భుజనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఉమా మాధవరెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలతో పాటుగా పలు అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత తాము టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఉమ మాధవరెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ది చెందుతుందనే విశ్వాసం తమకుందని చెప్పారు. ఈనెల 14వ తేదీన ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. వీరి వెంట జిల్లాకు చెందిన కొంత మంది నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
ఇప్పటికీ ఢీలా పడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉమా మాధవరెడ్డి కూడా పార్టీని విడిచిపెట్టడంతో మరింత బలహీనపడినట్టయింది.