బీజేపీతో ఇక సమరమే-పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు?

trs vs bjp బీజేపీ పై విమర్శల తీవ్రతను పెంచాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో క్రమక్రమంగా బలం పెంచుకుంటూ పక్కలో బల్లెంగా మారేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రస్తుతానికి కాంగ్రెస్ కన్నా బీజేపీతో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. జాతీయ స్థాయిలోనూ పార్టీ పూర్తిగా బలహీన పడడంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య వైరుద్యాలు, కార్యకర్తల్లో నైరాశ్యం వంటి కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి పెద్దగా ముప్పేమీలేదని గులాబీ బాస్ అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటూ ప్రబల శక్తిగా ఎదుకుతున్న బీజేపీ కన్ను తెలంగాణపై పడిందని ఈ క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనేది టీఆర్ఎస్ అధినేత అభిప్రాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల వరకూ కేసీఆర్ బీజేపీపై ఎక్కువగా విమర్శలు చేయలేదు. పలు సందర్భాల్లో ఆ పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరించారు కూడా. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి వ్యవహారాల్లోనూ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనూ బీజేపీకి కేసీఆర్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు నుండి కేసీఆర్ రూట్ మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని గట్టిగా నమ్మిన కేసీఆర్ దానికి అనుగుణంగా వ్యూహాలు రచించారు. మూడవ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నేతలను కలుసుకున్నారు కూడా. అయితే వీరి అంచానాలు పూర్తిగా తలకిందులు కావడంతో పాటుగా తెలంగాణలో బీజేపీ ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంతో కేసీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ వర్గాలు ఖంగుతిన్నాయి.పార్లమెంటు ఫలితాల తరువాత బీజేపీ తెలంగాణలో మరింత దూకుడును పెంచింది. ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూ వచ్చింది. ఇంర్మీడియట్ ఫలితాల అంశంతో పాటుగా పలు విషయాల్లో ప్రభుత్వాన్ని బీజేపీ ఇరుకున పెట్టింది. దీనితో పాటుగా పార్లమెంటులోనూ బీజేపీ ఇదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పైనా ప్రధానం దృష్టిసారిస్తూ ఆ పార్టీపైనా విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇక పై బీజేపీపై కూడా గట్టిగా దృష్టిపెట్టాలని పార్టీ అధినేత నుండి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. రకరకాల కారణాల వల్ల బీజేపీ పై విమర్శల విషయంలో కొంత వేచిచూసే ధోరణి కనిపించినా ఇక నుండి పూర్తి స్థాయిలో యుద్ధానికే దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.తెలంగాణలో బీజేపీ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ఇక కోలుకోలేని విధంగా పరిస్థితులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయని, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీవర్గాలకు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. ప్రతీ సందర్భంలోనూ బీజేపీ విధానాలను తీవ్రంగానే ఎండగట్టాలని ఇందుకోసం పక్క ప్రణాళికను రూపొందించాలని కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమీ- బీజేపీ నేతల ఆగ్రహం