అవిశ్వాసంపై తేలని టీఆర్ఎస్ వైఖరి

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం, వైెస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఆశక్తికరంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలమని కానీ, వ్యతిరేకమని కానీ టీఆర్ఎస్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి దీనికి తాము మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ లోని కొన్ని వర్గాలు అనధికారికంగగా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానంలో ఎటువంటి జాతీయ అంశాలు లేవనేది వీరి వాదన.
కేంద్రప్రభుత్వ విధానాలపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఈ సమయంలో రాష్ట్ర అధికారాలు, నిధులు లాంటి విషయాలు పరోక్షంగా ముడిపడి ఉన్న అంశంపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికితే ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడమే మంచిదని వారు చెప్తున్నారు. రిజర్వేషన్ల కోటాకు సంబంధించి పార్లమెంటులో టీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతోంది. ఈ అంశానికి అవిశ్వాస తీర్మానానికి సంబంధం లేకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై గుర్రుగా ఉన్న టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై రెండు రకాల వాదనలు వస్తున్నందుకు ఓటింగ్ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు సభలో లేకుండా గైర్హాజరవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అటు విశ్వాసానికి మద్దతు ప్రకటించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయకుండా సభలోనుండి బయటకి వచ్చి తటస్థంగా ఉండిపోవాలని టీఆర్ఎస్ నేతలు కొందరు అధిష్టానానికి సూచిస్తున్నారు.
పార్టీ అధినేత నుండి తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తాయని దాని ప్రకారం తాము నడుచుకుంటామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. పార్టీకి,తెలంగాణ రాష్ట్రానికి ఏది మంచిదయితే తమ నేత ఆ విధానాన్ని సూచిస్తారని వారు చెప్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని వారంటున్నారు.
trs, telangana rastra samithai, central government, no confidence motion, trs on no confidence motion, kcr, telangana, telangana state, telangana news.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *