లోక్ సభలో టీఆర్ఎస్ సభ్యుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేశారు. మాకు హైకోర్టు కావాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే టీఆర్ఎస్ సభ్యులు లేచి తెలంగాణ హైకోర్టు అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర విభజన జరిగి మూడు సంవత్సరాలు దాటినా ఇంతవరకు హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని వారు ప్రశ్నించారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత వెల్ లోకి దూసుకుని వచ్చి హైకోర్టు పై స్పందించాలంటూ నినాదాలు చేశారు.
సభ వాయిదా పడి తిరిగి సమావేశమైన అయిన తరువాత కూడా టీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. దీనితో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను గురువారం ఈ అశంపై ప్రకటన చేయనున్నట్టు టీఆర్ఎస్ సభ్యులకు తెలిపారు. అయితే ఎంత సమయంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేస్తారో స్పష్టంగా చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.