వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి

trs leaders unhappy ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారందరికీ తిరిగి టికెట్లు వస్తాయని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా వివిధ వేదికల్లో ఇదే విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సీట్లపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ నేతల ఆశలు గల్లంతయ్యాయి. అసెంబ్లీ టికెట్లు రాకపోయినా రానున్నది మన ప్రభుత్వమే కావడం వల్ల ఖచ్చితంగా ఏదోరకంగా న్యాయం చేస్తామని పార్టీ అధినాయకత్వం భరోసా ఇస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానంపై ఆశలు పెట్టుకున్న వారు మాత్రం నిరాశపడుతున్నారు. కొన్ని స్థానాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్న నేపధ్యంలో తమకు అవకాశం వస్తుందని గట్టి ఆశలుపెట్టుకున్నవారు ఇప్పుడు ఏమీ పాలుపోని స్థితిలోపడిపోయారు. కొందరు మాత్రం తప్పకుండా తమకు అవకాశం దక్కుతుందని నమ్ముతున్నా చాలా మంది మాత్రం ఇక ఎమ్మెల్యే టికెట్ పై అశలు వదులుకోవాల్సిందేనని భావిస్తున్నారు. ఇతర పార్టీల తరపున ఎమ్మెల్యేగా గెల్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారికి కూడా సీట్లు ఖాయమని పార్టీ అధినేత చెప్పడంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయిన వారికి కూడా టికెట్లు దక్కవని తెలిపోయింది. ముఖ్యమంత్రే స్వయంగా సిట్టింగ్ లకు తప్పకుండా టికెట్లు ఇస్తామంటూ చెప్పడంతో టికెట్ పై ఆశలు వదులుకోకతప్పని పరిస్థితుల్లో పడిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలకు కైవసం చేసుకుని సంపూర్ణ మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకే పరిమితం కాగా తెలుగుదేశం పార్టీ 15 , ఎంఐఎం7, బీజేపీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ 3, బీఎస్పీ 2, సీపీఐ 1, సీపీఎం 1 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఒక నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ కు భారీగా వలసలు పెరిగాయి. దీనితో ఆ పార్టీ బలం 63 నుండి 90కి పెరిగింది. 27 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసిన అభ్యర్థుల్లో కొంతమంది టికెట్ పై ఆశలు పెట్టుకున్నా ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఖాయమంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో వీరి ఆశలపై నీళ్లుచల్లినట్టయింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తిరిగి టికెట్ దక్కకుండా పోయే పరిస్థితులు ఉన్నాయని పలువురు నాయకులు తమ అంతరంగీకుల వద్ద వాపోతున్నట్టు సమాచారం.
స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో పార్టీ తీసుకున్న నిర్ణయానికి తలూపడంతప్ప మరో మార్గం లేకుండాపోయిందని వారు వాపోతున్నారు. లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని కూడా మార్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో లోక్ సభ టికెట్ పెట్టుకున్న వారి ఆశలు కూడా గల్లంతయ్యాయి. అటు లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేసి మంత్రి పదవులు తీసుకుందామనుకున్న వారిపై ముఖ్యమంత్రి ప్రకటన నీళ్లు చల్లింది. అయితే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని కనీసం కొన్ని సిట్టింగ్ సీట్లలోలైనా అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం బలంగా సాగుతోంది. దీనితో ఆశావాదులు తమ ప్రయత్నాలను మాత్రం విరమించుకోవడం లేదు. ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేసేందుకు వారు శాయశక్తులా కృషిచేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పురాకపోతుందా అనే గట్టినమ్మకంతో ఉన్నారు.
కొన్ని సిట్టింగ్ స్థానాల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేతల్లో కొందరు మాత్రం ఇప్పటికే పక్క చూపులు చూడడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పక్క పార్టీలో టికెట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనే విషయాన్ని గమనిస్తూ ఆ మేరకు పావులు కదపడం మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార పక్షం ఎమ్మెల్యేలు కాస్త బలహీనంగా ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ నుండి పార్టీ తరపున పోటీచేయడానికి ఆవకాశం రానిపక్షంలో ఆఖరి క్షణంలోనైనా గోడదూకడానికి సిద్ధపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ హవా కనిపిస్తుండడంతో పార్టీని వీడేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా విపక్ష పార్టీలతో మంతనాలు జరుపుతూ ఆ పార్టీ పెద్దలను మచ్చిక చేసుకుంటున్నట్టు సమాచారం.
ప్రస్తుతం విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ స్థానాలకు మాత్రం టీఆర్ఎస్ టికెట్లకు భారీ ఎత్తున పోటి నెలకొంది. స్థానిక నేతలతో పాటుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు, కొంతమంది ఎన్నారైలు టికెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలోని నియోజకవర్గాలపై ఆ వర్గాలు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీలు బలంగా ఉన్న స్థానాలను వదిలిపెట్టగా మిగిలిన కొద్ది సీట్లకు పెద్ద పోటీనే ఉంది.
మొత్తంమీద ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ సీట్లు ఖాయమంటూ పదే పదే చెప్పడం సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. తాను అసెంబ్లీ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సమయంలో ముఖ్యమంత్రి ప్రకటనతో ఎటు పాలుపోనిస్థితిలో పడిపోయినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక నేత “తెలంగాణ హెడ్ లైన్స్ ” వద్ద వాపోయాడు.
trs, trs leaders, trs leaders unhappy, kcr, telangana chief minister, telangana chief minister kcr, telangana rashtra samithi.

ముందస్తు ఎన్నికలకు వెల్లడం లేదు:కేసీఆర్


ప్రముఖ జర్నలిస్టు కుల్ దీప్ నయ్యర్ కన్నుమూత