పొత్తా..పోరా..

బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరించేందుకు టీఆర్ఎస్ సిద్ధపడుతోందనే వార్తలను ఇరు పార్టీల నేతలు ఖండిస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టే ప్రశ్నేలేదని టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అధికార పక్షంతో దోస్తీకి టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రివర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చోటు దక్కనుందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో టీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత టీఆర్ఎస్ అధినాకత్వంలో వచ్చిన మార్పుకు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడమే కారణమనే వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రధాని పై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు జోరు తగ్గడం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా టీఆర్ఎస్ పై పెద్దగా విమర్శలు చేయకపోవడం వంటి పరిణామాలను బట్టి కేంద్ర మంత్రివర్గంలో టీఅర్ఎస్ చేరడం ఖాయం అనే వార్తలు వచ్చాయి.
దేశ,రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని తప్ప అసెంబ్లీలో నోట్ల రద్దుకు మద్దతు పలకడానికి మరో కారణం లేదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహారించాలనే ఆలోచన తప్ప ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరే ఉద్దేశం తమకు లేదని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. ఇట్లాంటి వార్తలు అర్థంలేనివిగా ఆయన కొట్టిపడేశారు. ప్రస్తుతం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆనేత పేర్కొన్నారు.
ఇటు బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్, బీజేపీల పొత్తుపెట్టుపునే అవకాశమే లేదంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్నది తమ పార్టీ మాత్రమేనని వారితో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం తమకు లేదని అంటున్నారు. టీఆర్ఎస్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లోకి వెళుతున్నామని తాము టీఆర్ఎస్ తో కలిసి ముందుకు సాగే ఉద్దేశం ఏమాత్రం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *