రెండు పూర్తిగా భిన్న దృవాల మధ్య జరిగిన అధికార మార్పిడి వల్ల జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో త్రిపుర ఉదంతం కళ్లకు కడుతోంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టులు ఏలిన నేల ఇప్పుడు బీజేపీ హస్తగతమైంది. బీజేపీ-కమ్యునిస్టుల మధ్య సైద్దాంతిక విభేదాల సంగతి తెలియంది కాదు. కమ్యునిస్టుల ప్రభుత్వంతో పాటుగా ఆ పార్టీ ఆరాధ్యదైవంగా చెప్పుకునే లెనిన్ విగ్రహాలు కూడా ఇప్పుడు నేలకూలుతున్నాయి. బీజేపీ-కమ్యునిస్టు కార్యకర్తల మధ్య నడుమ జరుగుతున్న దాడులతో ఈ బుల్లి రాష్ట్రం అట్టుడుగుతున్నది. వందలాది కమ్యూనిస్టుల సానుభూతిపరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే దాడుల వార్తలు పూర్తిగా నిరాధారమని బీజేపీ చెప్తోంది.
అధికార మార్పిడి జరిగినంత మాత్రానా దాడులు, ప్రతిదాడులు విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఇందుకు కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే. గతంలో సాగించిన అణచివేత చర్యలకు ప్రతీకారంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటూ సమర్థించుకోవడం కూడా సరైంది కాదు. రాజకీయ వైరుద్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వమ్య యుతంగా వ్యవహరించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అధికారం కోల్పోయిన అసహనంలో దాడులు చేసినా.. అధికారంలోకి వచ్చామనే ధైర్యంతో దాడులకు తెగబడినా అది పూర్తిగా ప్రజాస్వామ్యానికే మచ్చ.
ప్రజాస్వామ్య యుతంగా అధికార మార్పిడి జరిగిన సమయంలో ఇటువంటి దారుణాలు చోటుకోసుకోవడం అవాంఛనీయ పరిణామం. అధికార మార్పిడి సాఫీగా జరగాలే తప్ప అది హింసాత్మక ఘటనలకు తావు ఇవ్వకూడదు.