చెట్లే ప్రగతికి మెట్లు

మండే ఎండల నుండి కొద్ది రోజుల క్రితం బయట పడగలిగాం. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు బెంబేలెత్తించాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యంతో పాటుగా చెట్లను విచ్చలవిడిగా కొట్టివేయడం ప్రధాన కారణమని నిపుణలు విశ్లేషిస్తున్నారు. తొలకరి ప్రారంభమయిన ఈ సమయంలో వీలున్నంత వరకు చెట్లను నాటి భూతాపాన్ని తగ్గించడంలో మనవంతు పాత్రను పోషిచడం ఎంతైనా అవసరం.
చెట్టు విలువ ఎంత?
ఒక చెట్టు విలువ ఎంతో చెప్పగలరా? మనం ఎప్పుడూ చెట్టుచేసే సేవకు విలువకట్టలేం. కానీ కొంతమంది దాని నుండి లభించే పండ్లు, కలపను ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తారు. కానీ చెట్టువలన ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందుతున్నాం.
50 సంవత్సరాల వయస్సున్న ఒక చెట్టు నుంచి దాదాపు 15,70,000 విలువైన వస్తు సేవలను మనం పొందుతున్నట్లు ఒక అంచనా.
పూర్తిగా ఎదిగిన చెట్టు ఒక మనిషి వదిలిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఆక్సీజన్‌గా మారుస్తుంది.
30-40 చదరపు మీటర్ల పచ్చని ప్రాంతం నుండి ఒక్కరోజులో తయారయ్యే ఆక్సీజన్‌ ఒక మనిషికి ఒకరోజుకు సరిపోతుంది.
ఒక కారు 100 లీటర్ల పెట్రోల్‌ను వినియోగించుకునేందుకు 350 కిలోల ఆక్సీజన్‌ అవసరమవుతుంది.దానికితోడు, కాలుష్యాలు భారీ మొత్తాల్లో గాలిలోకి విడుదలవుతాయి. 25,000 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించడం ద్వారా ఒక కారు విడుదల చేసే కాలుష్యాన్ని పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు పూర్తిగా పీల్చుకోగలుగుతుంది. ఒక చెట్టు సంవత్సర కాలంలో 330 కిలోల ఆక్సీజన్‌ను విడుదల చేస్తుంది.
ఒక హెక్టారు భూమిలో చెట్లు, మొక్కలు లేకపోతే సంవత్సరానికి 24 కిలోల సారవంతమైన మట్టి గాలి, నీటితో కొట్టుకుపోతుంది.
చెట్లు, మొక్కలు తాము ఉన్న ప్రాంతపు ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు తగ్గిస్తాయి.
మనం వాడే ఔషధాలలో 25శాతం మొక్కల నుంచి తయారైనవే.
వృక్ష సమూహం శబ్ధ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.30 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న వృక్షాలు 6నుంచి 8 డెసిబుల్స్‌ వరకు శబ్ధాన్ని తగ్గిస్తాయి.
ఎన్నో పరిశ్రమలకు చెట్లే ఆధారం. కాగితం పరిశ్రమ ఇందుకు ఒక ఉదాహరణ.
పచ్చని పరిసరాలు ఆహ్లాదమయ వాతావరణాన్ని సృష్టిస్థాయి.
నీటి సంరక్షణకు చెట్లు దోహద పడతాయి.
ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు చెట్లు నివాసంగా ఉపకరిస్తాయి.
చివరి క్షణం !
4,600,000,000 సంవత్సరాలు
ఇది మన భూమి వయస్సు !
ఊహకు అందని ఈ సుదీర్ఘమైన కాలాన్ని కొంచెంగా కుదించి ఆలోచిద్దాం.
ఈ భూమి 46 సంవత్సరాల మధ్య వయస్కుడనుకుందాం.
ఈయన అంటే, భూమి మొదటి 7 సంవత్సరాల గురించి మనకు అసలేం తెలియదు.
మధ్యకాలంలో కొద్ది సమాచారమే అందుబాటులో ఉంది.
ఇతనికి అంటే, భూమికి 42 సంవత్సరాలు వయస్సు వచ్చాక భూమి మీద తొలి పూవు వికసించింది.
ఇతనికి 44 ఏళ్ల వయస్సు నాటికి, డైనోసార్ల వంటి భారీ సరీసృపాలు అడుగుపెట్టాయి.
8 నెలల క్రితం నుంచే క్షీరదాలు అంటే పాలు తాగే జీవులు భూమిమీద కనిపించాయి.
వారం అంటే 7 రోజుల క్రితం మనుషుల్లాంటి కోతులు.
ఆ కోతులు మనుషుల్లాగా మారడం మొదలు పెట్టాయి.
ఆధునికుడైన మన మనిషి వచ్చి 4 గంటలైంది.
పోయిన గంటలో మన మనిషి వ్యవసాయాన్ని కనుగొన్నాడు.
పారిశ్రామిక విప్లవం మొదలై ఒక నిమిషం అయింది.
ఈ 60 సెకన్లలో ‘భూమి అనే స్వర్గం చెత్తకుప్పలా’ మారిపోయింది.
చుట్టూ కాలుష్యం.
గనుల గాయాలతో మన భూమి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వేల ప్రజాతుల జంతువులు అంతరించిపోయాయి.
మనం మాత్రం అభివృద్ధి పేరుతో
ఇంకా ఇంకా ఎదగాలనే తాపత్రయంలోనే ఉన్నాం.
ముందుకే అనుకుంటూ వెనక్కి
అతివేగంగా వెళుతూనే ఉన్నాం…ఈ క్రమంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఏకైక మార్గం చెట్లను పెంచడమే. నిజానికి చెట్లే ప్రగతికి మెట్లను చెప్పవచ్చు.
ఈ వానాకాలంలో అయినా మనం మన చుట్టు పక్కల చెట్లను పెంచుందా భూమిని కాపాడు కుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *