తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ రోజును ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. తొలి ఏకాదశి పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు (24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొక సారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.