కొత్త సంవత్సరంలో తెలంగాణ నేతల జాతకం…

0
64

ఉగాది రోజున ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా చేసేది తమ రాశీ ఫలాలను చుసుకోవడం. రానున్న సంవత్సరంలో తమ భవితవ్యం ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం… ప్రస్తుత ఎన్నికల నామ సంవత్సరంలో మన నాయకుల రాశీ ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం…
కేసీఆర్ (టీఆర్ఎస్)
ఈ సంవత్సరంలో అద్భుతమైన విజయాలు సాధించిన కేసీఆర్ కొత్త సంవత్సరంలోనూ మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బంధుగణం నుండి లభించే సహకారం వల్ల అన్ని ఆటంకాలను అవలీలగా అధికమిస్తారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి పట్టు సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ తన దైన పాత్రను పోషించే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో మిత్రులు అధికారాన్ని చేపడితే ఈయనకు ఇక తిరుగుండదు. అయితే అది అనుకున్నంత సులభంగా కలిపించడం లేదు. తనకు దగ్గరగా ఉన్న వారినుండే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
గత సంవత్సరం ఆశల పల్లకిలో ఊరేగిన ఈయనకు ఈ సంవత్సరం కూడా కష్టాలు తప్పేట్టు లేవు. తనకు బాసటగా ఉంటారనుకునే మిత్రులు ఒకొక్కరుగా దూరం కావడంతో డీలా పడిపోయే అవకాశం ఉంది. పోరాడేందుకు కూడా శక్తిని లేకుండా పోయే ప్రమాదం ఉంది. పై వారి నుండి అన్ని అండదండలు ఉన్నా అవి కలిసి రావడం లేదు. ఆర్థికంగా నష్టాలు తప్పేట్టు లేవు. పరువు పోయే ప్రమాదం కనిపిస్తోంది. శత్రువులు చాలా బలంగా ఉండడంతో పాటుగా మిత్రులు కూడా శత్రువులతో చేతులు కలపడం వల్ల కోరుకున్నది సాధిచడం కష్టంగానే కనిపిస్తోంది. తనకు అండగా నిలబడే వర్గం పై స్థాయిలో అధికారంలోకి వస్తే మాత్రం ఈయన కోలుకునే అవకాశం ఉంటుంది.
కే. లక్ష్మణ్ (బీజేపీ)
ఇతనికి పై స్థాయి వ్యక్తులు ఆశీస్సులతో పాటుగా ఆ వ్యక్తులు కూడా బలంగానే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితాలు అందడంలేదు. శతవిధాలా ప్రయత్నించినా పనులు సానుకూలంగా జరగడం లేదు. తాను పోటీ చేస్తున్న వ్యక్తులతోనే కొంత సర్థుకుని పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా శత్రువులతోటే కలిసి నడవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహచరుల నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందే అవకాశాలు కనిపించడం లేదు. మిత్రులతో విభేదాలు తప్పని పరిస్థితి. కొత్త వ్యక్తులు పెత్తనం చెలాయించే ప్రమాదం ఉంది.
ఎల్. రమణ (టీడీపీ)
గత సంవత్సరం అత్యంత దారుణంగా ఉంది. ఈ సంవత్సరంలో అయినా పరిస్థితులు మారతాయనే ఆశలు ఉన్నా ఆ ఛాయలు ఏవీ కనిపించడంలేదు. కొత్త మిత్రుల వల్ల కలిసి వస్తుండనుకుంటే అది పరిస్థితిని మరింత దిగజార్చింది. కనీసం పోరాడే శక్తి కూడా లేకుండా చేయడం వల్ల సంవత్సరం ఆఖరిలో యుద్ధానికి దూరంగా వెళ్లిపోయిన పరిస్థితి. సాక్షాత్తూ కుటుంబ పెద్దే తీవ్రంగా పోరాడుతున్న సందర్భంలో ఆయన విజయం పైనే కొత్త సంవత్సరంలో ఆశలు పెట్టుకుని బతుకున్నారు. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి రావడం మరో పెద్ద గండంగా కనిపిస్తోంది.
నోట్: ఇది ఊహాజనితం మాత్రమే….

Wanna Share it with loved ones?