దేవుడి దగ్గరా సామాన్యులకు దిక్కులేదా…

దేవుడి ముందు అంతా సమానులే… కానీ వీఐపీలు కాస్త ఎక్కువ సమానులు…వీఐపీ భక్తుల హడావుడిలో సామాన్యులు నలిగి పోతున్నారు. ఎంతో వ్యయ ప్రయాశలకు ఓర్చి వచ్చిన సామాన్య భక్తులకు దేవుడిని దర్శించుకునే సమయంలో నిరాశే మిగులుతోంది. వీఐపీల సేవలతో తరిస్తున్న ఆలయ అధికారులు సామాన్య భక్తులను పూర్తిగా విస్మరిస్తున్నారు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదు. సామాన్యుడికి సవాలక్ష ఆంక్షలు పెట్టే ఆలయ యాజమాన్యం వీఐపీల విషయంలో మాత్రం నిబంధనలకు నిలువునా తూట్లు పొడుస్తున్నారు. వీఐపీలకు నిబంధనలు పట్టవు. సాక్షాత్తూ దేవుడి సన్నిధిలోనే ఈ అసామాన్యులు తమ ఇష్టానుసారం వ్యవహరించినా అడ్డుకునే నాధుడే ఉండడు. ముసలి, ముతక, నడవలేని వారికి సైతం నిబంధనలు పెట్టి వారిని వేధించుకుని తినే ఆలయ అధికారులు పెద్దల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వరుడు అయినా… సింహాద్రి అప్పన్న అయినా… యాదాద్రి నృసింహుడైనా… భద్రాచల రాముడైనా… ఎవరైనా సరే ఈ వీఐపీలకు లెక్కలేదు. వారు కోరుకున్న సమయంలో కోరుకున్నంత సేపు దేవుడి సన్నిధిలో గపడాల్సిందే. వారు వచ్చిన సమయంలో సామాన్యులు పడే ఇబ్బందులు వీరికి పట్టవు. వీఐపీల కొలువులో జన్మ ధన్యం చేసకునే ఆలయ అధికారులకు సామాన్యుల గోడు పట్టదు. గంటల తరబడి క్యూలైన్లు నిలిపివేస్తారు. రెప్పపాటులో దేవుడిని కనీసం కనులారా చూడకుండానే రెక్కలు పట్టుకుని విసిరేస్తారు. వీఐపీలకు మాత్రం రాచబాటలో దర్శనం చేయించి తరిస్తారు. స్వామి వారి కార్యాన్ని ఘనంగా నిర్వహిస్తే తమ స్వకార్యం వీఐపీల ద్వారా తీర్చుకోవచ్చేనే ఆశ వీరిది. ఈ హడావుడిలో పాపం సగటు భక్తుడికి దేవాలయం లోనే ‘ముక్తి ‘లభిస్తోంది.
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అనాదిగా ఈ ఆచారం వస్తోంది. ఇటీవల వీఐపీ టికెట్ల ముసుగులో మహిళలు శబరిమలలోకి ప్రవేశించారనే దుమారం రేగుతోంది. దీనిపై కేరళా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే వీఐపీ ల ముసుగులో నిబంధనలు పక్కన పెట్టి మహిళలు ఆలయ ప్రవేశం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదీ వీఐపీ భక్తుల పాలిట దేవాలయ అధికారులు చూపిస్తున్న శ్రద్ద. అటు భద్రాచల రామాలయంలోకి ఒక వీఐపీ భక్తుల జంట ఏకంగా గర్భాలయంలోకి ప్రవేశించడం వివాదాస్పదం అయింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తులు చేసే హంగామా దానికి టీటీడీ అధికారుల వత్తాసును గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎప్పుడైనా మీడియాలో వార్తలు వచ్చినప్పుడో లేదా మరెవరైనా ఈ అంశన్ని తెరపైకి తెచ్చినప్పుడో కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప సామాన్యులకు నిజంగా దేవుడిని దూరం చేస్తున్నారనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహరణపై అధ్యాయనం జరగాలి… దేవుడు కేవలం కొంత మంది పెద్దవారికి పరిమితం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *