ఇదే స్పూర్తి,దీక్షతో భాషోధ్యమానికి కంకణ బద్దులం కావాలి

(డాక్టర్ బీ.ఎల్.ప్రసూన, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు)

ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో అన్నట్టుగా జరిగాయి. తెలుగుపై ఉన్న మమకారాన్ని తట్టిలేపేలా జరిగిన ఈ సభలు సంపూర్ణంగా విజయవంతం అయ్యాయి. చిన్న చిన్న లోటు పాట్లు మినహా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభలను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం జౌరా అనిపించుకుంది. తెలుగు సభలతో ఇప్పుడు తెలుగు నేలపైనే కాకుండా ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరిలోనూ తెలుగు భాష పై చర్చ మొదలైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సభలు, సమావేశాలు సమస్యల పరిష్కారానికి వేదికలు కానంతవరకు వ్యర్థ ప్రయత్నాలే అన్నది నిర్వివాదాంశం. “స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొందీ అదె విజయమనుకుంటె పొరపాటోయి” అన్నారు ఒక పాటలో శ్రీశ్రీ సాధించనదానితో సంతృప్తిని పొందకుండా ఇంకా సాధించాల్సింది ఏమిటి అన్న చర్చ కొనసాగించాలి. నిరంతర అధ్యాయనాలు జరగాలి. సమస్యల పరిష్కార దిశగా తెలుగు ప్రజలంతా పయనించాలి. ముందుగా భావి పౌరులకు నిజమైన తెలుగు భాషను అందించాలి. రాబోయే తరాల వారికి భాషా విలువలు, సంస్కృతి, సంస్కారం తెలియజేయడం వల్ల భాష బ్రతుకుతుంది. మన పెద్దలకు తెల్సిన సాహిత్యం భాషా పదాలు మనకు తెలియలేదు. మనకు తెలిసినంత కూడా రేపటి పౌరులకు తెలియనివ్వడం లేదు. కారణాలు ఏవైనా ఫలితం ఒక్కటే. విద్యార్థులను చదవనివ్వని ధైన్యం, గ్రాంధాల పట్ట నిరాసక్తత, డిజిటలైజేషన్ మోజు, కుటుంబ సంబంధాలు నామమాత్రంగా మారడం , కర్ణూడి చావులు కారణాలు ఎన్నో… భాషాధ్యాయనానికి అటంకాలన్నీ దశాద్బాల క్రితమే ఘోరా శాస్త్రి చేనేత అభివృద్ధికి ఏర్పాటు చేసిన సభలను నిరసిస్తూ సంపాదకీయాలు రాశారు. వీదేశీ వస్త్రాలను, మిల్లు వస్త్రాలను పరిచయం చేసి సామాన్యులకు తక్కువ ఖర్చుతో వస్త్రాలను అందిస్తుంటే చేనేత వైపు ఎవరు దృష్టిసారిస్తారని ప్రశ్నించారు. భారతదేశం ఎప్పుడూ ఆకర్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. అంతేకానీ దానివలన వచ్చే దష్పరిణామాలను తెలుసుకోలేకపోతున్నారు. చేతులు కాలాకా ఆకులుపట్టుకునే నైజం మనది. అందుకే మరలా మరలా ప్రజలకు, సమాజానికి భాషాను బ్రతికించుకునే ప్రయత్నంలో భాగస్వాములు కండి అని పెద్దలు చెప్తున్నారు. సమస్య ఏ ఒక్కరిదో కాదు అందరిదీ సామూహికంగా పరిష్కరించుకుంటేనే మరో నవశకానికి నాంది పలుకగలుగుతాం. ఎన్ని పనులున్నా రోజుకు ఒక గంట బాష కోసం శ్రమిస్తే చాలు. సుందర నందనోధ్యానంలో భాష కుసుమాలు వికసిస్తాయి. సౌరభాన్ని వెదజల్లుతాయి.