ఆందోళన బాటలో తెలుగు ఎంపీలు | ap mps agitation

పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఢిల్లీలో తెలుగు ఎంపీలు పార్లమెంటు వెలుపల తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు విడివిడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవాలని తెలుగు ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని మోడీ నివాసం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అది రాష్ట్ర ప్రజల హక్కని పేర్కొంటూ ప్లకార్డులు పట్టుకుని తెలుగుదేశం ఎంపీలు ధర్నాకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలిసిందేనని వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో ఎంపీ సుజనా చౌదరి స్వల్పంగా గాయపడ్డారు. ఎంపీలని కూడా చూడకుండా పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని ఎంపీలు మండిపడ్డారు.
పార్లమెంటులో తమ నోరు నొక్కిన కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తాము రోడెక్కాల్సివచ్చిందని తెలుగుదేశం ఎంపీలు అన్నారు. తుగ్లక్ రోడ్డులో ఉన్న ఎంపీలకు ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న నిరసనలో ఎటువంటి తప్పులేదని, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని ఆయన అన్నారు.
హోదా కోసం ప్రధాని నివాసానికి వచ్చిన ఎంపీలను కలిసి మాట్లాడాల్సింది పోయి వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరైంది కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అటు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్న ఎంపీల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద రావుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్ష చేస్తున్న తమ పార్టీ ఎంపీలను వై.ఎస్.విజయమ్మ పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పోరారుడుతూనే ఉందని ఆమె అన్నారు. హోదా కోసం వివిధ సందర్భాల్లో జగన్ ఆందోళన చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. హోదా కోసం జగన్ పోరాటం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదని నాడు బీజేపీకి వత్తాసు పలికిన చంద్రబాబు హోదా అవసరం లేదన్నట్టు మాట్లాడారని ఆమె దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్దిలేదని ఆమె ఆరోపించారు. దీక్ష శిభిరాన్ని సీపీఐ నేత డి.రాజ సందర్శించారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతు ప్రకటించిన రాజా హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అన్యాయం చేస్తోందని అన్నారు.
పార్లమెంటులో ఆందోళన జరిపానా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం తెలుగు ఎంపీలు నిరాహార దీక్ష చేస్తున్న పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిలో ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు.
telugu mps, telugu, delhi, andhra pradesh, andhra, andhra pradesh mp, telugudesam party, ysr congress, y.s.jagan, y.s.jagan mohan reddy.
hoda
andhra pradesh
_India_by_population
Census_of_India