కవి పండితులారా మెల్కోండి…

తెలుగు భాష కేవలం కావ్య భాష కాదు అది చైతన్య స్రవంతి. తెలుగు భాషలోకి ఎన్నో పదాలు వచ్చి చేరితే మరెన్నో పదాలు లుప్తమైనాయి.కవి సామ్రాట్టుల నుండి సమాన్య జనం వరకు తెలుగు భాషతో ఆడుకున్నారు. చమత్కారాలు, నుడికారాలు, సామెతలు, పలుకు బళ్లు, జాతీయాలు ఒకటేమిటి ఎన్నోన్నో… ఈ రోజు వీటి మధ్య తేడాలను తెలుసుకోవాలంటే గ్రంధాలను తిరగేసే పరిస్థితి వచ్చింది. శిష్ట సాహిత్యం ద్వర్తి కావ్యాలు, ప్రౌడ శైలి నారికేళ పాకంలో నర్తన చేయగా జనపదాలలో జానపదాలు ద్విపదలు అంతేవేగంగా నర్తించాయి. అమ్మమ్మ, నానమ్మల నోట్లో రామాయణ, మహాభారత, భాగవతాలు లయబద్దంగా తిరుగుతుంటే సాయంత్రం పురాణ కాలక్షేపంలో కావ్యాలు ప్రజల నోట్లో నానేవి. పిల్లల పాటల్లో, ఆటల్లో ఎన్నో పదాలు, పలుకుబళ్లు విస్తృతంగా ప్రచారం అయ్యేవి. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం కావు. కేవలం పది, పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. కొత్త పాతను మరిపించాలే కానీ పూర్తిగా కనుమరుగు కానీయకూడదు. భాష అంటే సినిమా, టీవీలోదే కాదు అన్నది తెలుసుకునే దాకా ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. ఎవరో తమ స్వలాభం కోసం రాసే రాతలన్నీ పద్యాలు కావు. కానీ మేధావి వర్గం పెదవి విప్పనంత కాలం తప్పులు తెలుసుకోలేరు సామాన్యజనం. తాము చూసిందే, విన్నదే అసలైన భాషగా వక్రీకరిస్తారు. కాబట్టి మిగిలి ఉన్న కొద్ది మంది కవిపండితులారా మెల్కోండి. తప్పులను సరిదిద్దండి. భావి పౌరులకు భాషను నేర్పించండి.

డాక్టర్ బీ.ఎల్.ప్రసూనా
(విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు ఖమ్మం జిల్లా)