తెలుగు సభల భాద్యత అంతా ముఖ్యమంత్రిదేనా…?

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా వ్యవహారించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నప్పటికీ కొంత మంది అధికారుల తీరు వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు మహాసభల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్వాగతతోరణంలోనూ అంగ్ల అక్షరాలు కనిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఫొటో కింద రాసిన భాష ఎవరికీ అర్థం కానట్టుగా ఉంది. ఆంగ్ల పదానికి గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా తర్జుమాకు చేసిన ప్రయత్నం తో అసలు అది ఏ భాషో అర్థం కాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కనీసం తెలుగు తెలీనీ అధికారులు ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమ బాధ్యతలు చూస్తున్నారా అంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
మరో వైపు ప్రపంచ తెలుగు మహా సభలకు రాష్ట్రంలోని తెలుగు ఉపాధ్యాయులను అందరినీ ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన ఉత్తర్వులను మాత్రం ఇంగ్లీషులోనే పంపారు. దీనిపై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మహాసభలకు ఆహ్వానాలను అయిన తెలుగులో పంపిఉంటే బాగుండేదని అంటున్నారు.
ప్రభుత్వం భారీ ఎత్తున జరుపుతున్న ఏర్పాట్లలో చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజమే అయినా అధికారులు మరింత చిత్తశుద్దిగా వ్యవహరిస్తే ప్రతిష్టాత్మక తెలుగు మహాసభలు మరింత శోభాయమానంగా జరిగే అవకాశాలున్నాయి.