మిలీయన్ మార్చ్ స్పూర్తి సభను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ మిలియన్ మార్చ్ స్పూర్తి సభను పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. 2011 మార్చి 10న ప్రారంభమైన మిలియన్ మార్చ్ ను గుర్తుచేసుకుంటూ స్పూర్తి సభను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పాటుగా సభ నిర్వహిస్తామని చెప్పిన ట్యాంక్ బండ్ పరిసరాలను పోలీసులు పూర్తిగా దిగ్భందనం చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాట్లు చేసి ట్యాంక్ బండ్ పరిసప ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఎవరినీ అనుమతించకపోవడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.
మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు వెళ్లడానికి ప్రయత్నించిన జేఏసీ నాయకులతో పాటుగా వామపక్షనేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ను తార్నాకాలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుండి బయటికి వచ్చిన వెంటనే కోదండరాంతో పాటుగా ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకితీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోదండరాంతో పాటుగా పలువురు జేఏసీ నాయకులను, రాజకీయ నేతలను పోలీసులు వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నాయకుడు చాడా వెంకట్ రెడ్డిని నారాయణగూడలో పోలీసులు అరెస్టు చేయగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ను ట్యాంక్ బండ్ వద్ద అరెస్టు చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *