తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగే లేదు…

0
61

తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగే లేదు…
2001 ఎప్రిల్ 27… తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కే. చంద్రశేఖర్ రావు మరికొద్దిమందితో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. నాడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్న కేసీఆర్ ఆ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ ను ప్రారంభించారు. తెలంగాణలో ప్రబలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదుగుతుందని ఆనాడు బహుశా ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ పేరుతో వెలిసిన మరో రాజకీయ సంస్థగానే చాలా మంది నాడు భావించారు. టీఆర్ఎస్ తొలినాళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కలిసివచ్చే మిత్రులతో కేసీఆర్ టీఆర్ఎస్ ను ముందుకుతీసుకుని వెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు.
కేసీఆర్ రాజకీయ చతురత, తెలంగాణ సెంటిమెంట్ తదితర కారణాలవల్ల టీఆర్ఎస్ కు క్రమంలో ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సత్తా తమకే ఉందంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లిన టీఆర్ఎస్ 2004 ఎన్నికల నాటికి తనకంటూ తెలంగాణ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంది. టీడీపీకి వ్యతిరేకంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకిదిగిన టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 5 లోక్ సభ స్థానాలను గెల్చుకుని తన ఉనికిని ఘనంగా చాటుకుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్ నాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రిపదవులను తీసుకుంది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006 నాటికి పరిస్థితుల్లో మార్పులు కనిపించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ముందడుగు వేయనందుకు నిరసగా కేంద్ర, రాష్ట్ర మంత్రిపదవుల నుండి వైదొలగడంతో పాటుగా కేసీఆర్ లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికల భరిలోదిగి భారీ మెజార్టీతో గెలుపొదడంతో టీఆర్ఎస్ హవా మరింతి పెరిగింది.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా పోరాడుతూ వచ్చిన టీఆర్ఎస్ కు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో మొదటి ఎదురుదెబ్బతలిగింది. ఆ తరువాత 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం వాటిలో పార్టీ ఘోరంగా దెబ్బతినడంతో టీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. 2009 ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీడీపీతో పాటుగా వామపక్షాలతో జట్టుకట్టిన టీఆర్ఎస్ కు అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ సమయంలోనే ఇక టీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందని చాలామంది భావించారు. పార్టీ నేతగా కేసీఆర్ కు ఇది పరీక్షాకాలమనే చెప్పాలి.
అటు తరువాత జరిగిన వివిధ పరిణామాల నేపధ్యంలో తెలంగాణ ఉధ్యమాన్ని టీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకుని పోయింది. తెలంగాణ ఉధ్యమం తీవ్రస్థాయిలో విస్తరించింది. అప్పడే ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం దీనిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు రేగడంతో తెలంగాణను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీనితో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ తో పాటుగా దాని అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిల్చిపోయారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా బరిలో నిల్చి తెలంగాణలో పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వివిధ పార్టీల నుండ గెల్చిన ఎమ్మెల్యేలను కలుపుకుంటూ తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 2019 ఎన్నికల్లో తిరిగి భారీ మెజార్టీతో తిరిగి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రెండవ సారి ధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ నుండి గెల్చిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొనే సత్తా విపక్షాలకు ఏమాత్రం లేదనేది అక్షరసత్యం. మరో వైపు టీఆర్ఎస్ పై అనేక విమర్శలు కూడా వెల్లవెత్తుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి వలసవచ్చిన రాజకీయ నాయకులను నెత్తిపెట్టుకుందనే విమర్శలతో పాటుగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని అవసరం తీరాకా పక్కన పెట్టి నాడు తెలంగాణను వ్యతిరేకించిన వారిని పార్టీ అక్కున చేర్చుకుందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురిచేస్తోందనే విమర్సలు కూడా ఉన్నాయి. పార్టీ పూర్తిగా కుటుంబ వ్యవహారంగా మారిపోయిందని పార్టీలో ఎవరికీ అధికారాలు లేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసీఆర్ నుండి పార్టీ పగ్గాలను తీసుకున్న కేటీఆర్ అదే దూకుడుతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏది ఏవైనా ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ జోరును అడ్డుకునే సత్తా విపక్షాలకు లేదనేది మాత్రం తిరుగులేని వాస్తవం.
(టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…)

Wanna Share it with loved ones?