అబద్దపు ప్రచారాలు చేస్తే జైలుకేనా…?

సామాజిక మాధ్యమాలు ఇప్పుడు అందరి జీవితాల్లో భాగం అయిపోయాయి… ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మీరు చేసే ప్రతీ కామెంట్ ను ప్రభుత్వం గమనిస్తోంది… ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసినా జైలుకు పోవడం ఖాయం… ఇటీవల సామాజిక మాధ్యామాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న పోస్ట్ ఇది. రాజకీయ నాయకులకు సంబంధించిన ఎటువంటి పోస్టులు చేసినా పోలీసులు కేసులు పెడతారంటూ జరుగుతున్న ప్రచారంతో చాలామంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయిన చాలా వార్తల్లాగే ఇది కూడా వాస్తవం కాదు. ఇదిగో పులి అంటే అదిగో తోక చందానికి చెందిన వార్తే. అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అబద్దపు వార్తలను అరికట్టే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందనేది వాస్తవం అయినా ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రనా కేసులు పెడతారనుకుంటే పొరపాటే… అయితే ప్రభుత్వమే కాదు ఎవరిపైనానా అబద్దపు ప్రచారాలు, అభూత కల్పనలు, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేవార్తలు, జాతి వ్యతిరేక వార్తలకు ప్రచారం కల్పిస్తే మాత్రం జైలుకు పోవడం ఖాయం.
సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కాలంలో వాస్తవాలకన్నా అబద్దపు ప్రచారాలే ఎక్కువగా జరుగుతున్నాయనేది నిజం. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయంటూ జరిగిన ప్రచారం వల్ల పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక వర్గం వారిపై మరో వర్గం చేసిన వ్యతిరేక ప్రచారం, వదంతుల కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని సంస్థలపై జరిగిన తప్పుడు ప్రచారం వల్ల ఆయా సంస్థలు కోట్లాది రూపాయలను నష్టపోయాయి. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, అబద్దాలను ప్రచారం ద్వారా ఆర్థికంగా నష్టపర్చడం లాంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. కొన్ని రకాల ప్రచారాల వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం లేకున్నా కొన్ని ప్రచారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇందుకే సోషల్ మీడియా హబ్ ను ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఒక కన్నేసి ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర సమాచారా ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించిన మాట వాస్తవం అయినప్పటికీ ఇంకా ఆ వ్యవస్థ ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన టెండర్లను ఆగస్టు 20 తరువాత పిలవనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి మార్గదర్శకాలు రూపొందనప్పటికీ ఇప్పటినుండే మరో ప్రచారం ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి పోస్ట్ లు చేసినా జైలు పోవడం ఖాయమని సదరు పోస్టులో చెప్తున్నారు ఇది ఏమాత్రం వాస్తవం కాదు.
భారదేశంలో వార్తపత్రికలకు, టెలివిజన్ ఛానళ్లకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు ఏవీ లేవు. భావ ప్రకటన స్వేచ్చలో భాగంగానే ఇవి పనిచేస్తున్నాయి. అదే ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు వర్తిస్తుంది. భావప్రకటన స్వేచ్చను రాజ్యాంగం కల్పించినప్పటికీ వాటికి అనేక నియంత్రణలు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో అరాచకాలకు పాల్పడితే ప్రభుత్వానికి శిక్షించే అధికారం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలపై నిఘాకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇందులో కేవలం జాతివ్యతిరేక ప్రచారాలకు అడ్డుకట్టవేయడంతో పాటుగా అబద్దపు వార్తలను ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, వందతులను సృష్టించకుండా నిలువరించడం, వైషమ్యాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవడం లాంటివి ముఖ్యమైనవి అంత మాత్రనా ప్రభుత్వానికి లేదా వ్యక్తులను వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రనా కేసులు ఏమీ నమోదు కావు. ఏ ప్రభుత్వ లేదా పార్టీల పనితీరును విమర్శించే స్వేచ్చ ప్రతీ పౌరుడికీ ఉంటుంది. అయితే విమర్శలు ఒక పరిధిని దాటకూడదు.
మరోవైపు సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని చూస్తోందనే విమర్శలు కూడా లేకపోలేదు. అబద్దపు ప్రచారాలను సాగుగా చూపి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీంకోర్టు కూడా మండిపడింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.‘ప్రజల వాట్సాప్, ట్విట్టర్ సందేశాలపై నిఘా పెట్టాలనుకుంటున్నారా? ప్రజల వాట్సాప్‌ సందేశాల మీద కేంద్రం నిఘా పెట్టినందువల్ల నిత్యం ప్రభుత్వ నిఘాలో ఉండే రాజ్యం ఏర్పడుతుంది’ అని కోర్పు వ్యాఖ్యానించింది.‘సోషల్ మీడియా హబ్‌’ ద్వారా ప్రజల వాట్సాప్, ట్విటర్, ఇ-మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వం నిఘా కన్నేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్‌ నేత మహువా మోయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
social media, supreme court

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కమ్యూనిస్టు ఛానళ్లు


ఆగస్టు చివరికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
social-media-hub