బతుకు బరువై…ఆదరణ కరువై… ఎందరో వృద్ధులు మన దేశంలో అత్యంత దయనీయమైన స్థితిలో జీవిత ఆఖరి మజిలీని దాటుతున్నారు. అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లాంటి దేశాల్లో వృద్దులు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనేక మంది వృద్దులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మరి కొందరి పరిస్థితి మరోలా ఉంది. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ పలకరించే దిక్కులేక బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. మనదేశంలోని వృద్దుల్లో అధికశాతం మంది మానసిక సమస్యలతో అల్లాడుతున్నారు. కనీసం పలకరించే దిక్కులేకే కొందరికి ఈ పరిస్థితి దాపురించింది. ఇక మనదేశంలో వృద్దులకోసం ప్రత్యేకమైన చట్టాలు పెద్దగా లేవు. ఉన్న అరకొర చట్టాలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు ఆలవాలంగా ఉన్న మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు కనిపించకుండా పోయాయి. పల్లెలనుండి పట్నలకు వలసలు, పట్టణాల నుండి విదేశాలకు వలసలకు వృద్దులు ఒంటరిగా మిగిలిపోతున్నారు.
1960లలో మన దేశంలో 2.4 కోట్ల మంది వృద్దులు ఉండగా 2001 జనాభా లెక్కల నాటికి 7 కోట్లకు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 15కోట్ల మందికిపైగా వృద్దులు ఉండగా,2050 నాటికి వీరి సంఖ్య 32.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల ల్లో ముగ్గురిలో ఒకరు గురవుతున్నారని హెల్పేజ్ ఇండియా అధ్యాయనంలో తెలిసింది. 2011 జనాభా లెక్కలు సేకరించే సమయానికి దేశవ్యాప్తంగా కోటిన్నర మంది వృద్ధులు ఒంటిరిగా జీవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ తోడు వృద్దాప్యంలో వస్తున్న వ్యాధులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. జవసత్వాలు లేక వృద్దులు నరక యాతన అనుభవిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ అంటూ వృద్దులకు అందిస్తున్న సౌకర్యాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆర్థికంగా ఆసరాతో పాటుగా మేమున్నామనే భరోసా కూడా ముఖ్యమే అదే ఇప్పుడు వారికి కరువవుతోంది.
సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా…