కాంగ్రెస్ లో రాహుల్ శకం ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్ గాంధీ పార్టీ అధికార బాధ్యతలను చేపట్టారు. గత 19 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నుండి బాధ్యతలను బుజానికి ఎత్తుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు పార్టీ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన దృవీకరణ పత్రాన్ని రాహుల్ కు ఆయన పార్టీ పెద్దల సమక్షంలో అందచేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయిన వెంటనే పార్టీ కార్యలయంగా పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో నెహ్రు కుటుంబానికి చెందిన ఆరో వ్యక్తి బాధ్యతలు చేపట్టినట్టయింది. అంతుకు ముందు మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తో పాటుగా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.