తెలంగాణ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందంటూ విపక్షాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశాయి. నేరెళ్లలో ఇసుక మాఫియాకు వంత పాడిన స్థానిక పోలీసులు దళితులను తీవ్రంగా వేధించారని, వారిని పోలీస్ స్టేషన్ లో చితకబాదారంటూ రాష్ట్రపతికి వివరించారు. స్థానికంగా తిరిగుతున్న ఇసుల లారీల వల్ల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని దీనితో ఆగ్రహం చెందిన దళితులు లారీలను ఆపితే ఇసుక లారీల యజమానులకు మద్దతు పలికిన పోలీసులు దళితులను ఇళ్లనుండి తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేశారని విపక్షాలు ఆరోపించాయి. పోలీసుల చర్యలకు ప్రభుత్వం మద్దతుగా నిల్చిందని బాధ్యలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు రాష్ట్రపతికి వివరించారు. కేవలం ఒక ఎస్.ఐ ను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని దళితులను చిత్రహింసలు పెట్టిన ఘటనలో ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని విపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి.
నేరెళ్ల ఘటనపై సమగ్ర విచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో జోఖ్యం చేసుకోవాలని కోవింద్ ను కోరుతూ ఒక మెమోరాండంను సమర్పించాయి. రాష్ట్రపతిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ, వామపక్ష నేతలతో పాటుగా తెలంగాణ పొల్టికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కూడా ఉన్నారు.