సహజ కవి పోతన…

పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!
తెలుగు నేలలో ఈ పధ్యం రానివారి చాలా అరుదనే చెప్పాలి. సహజ కవిగా పేరుగాంచిన బమ్మెర పోతన విరచిన భాగవతంలోని పధ్యాలు పండిత పామరులను ఇద్దరినీ అలరిస్తాయి. భుక్తీ కోసం హలం పట్టిన పోతన తన కవిత్వాన్న ఏనాడు అమ్ముకోలేదు. ధనం, బంగారం లాంటివి ఏవీ పోతన కవిత్వాన్ని కొనేందుకు తూగలేకపోయాయి. అందుకే
“పట్టునది కలమొ, హలమొ – సేయునది పద్యమో, సేద్యమో” అని “కరుణశ్రీ” జంధ్యాల పాపయ్య శాస్త్రి అంచారు. పోతన భాగవతంలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. సాహిత్యాన్ని కేవలం పండితులకే పరిమితం చేయకుండా శబ్ద గాంభీర్యాలకు పోకుండా ఆయన పామరుల మనసులను సైతం రంజింపచేశారు.
తొలుత భక్తుడైన పోతన, తర్వాతి కాలంలో రాముని భక్తుడై, శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ అని భాగవతాన్ని తెలుగులోకి అనువదించడానికి కల కారణాలు చెప్తూ రాశారు.
శివుడు, విష్ణువును వేరుగా చూడడం లేదని చెప్పిన ఆయన
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు… అంటారు.
క్రీ.శ. 1450 – 1510 మధ్యకాలంలో జీవించిన పోతన తన కవితాధారను ధన రూపంలో మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరి నుండి ఎన్ని ఒత్తిడి వచ్చినా ఎవరు ఎన్ని హేళనలు చేసినా ఆయన తీర మారలేదు. ” బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్‌, గూళుల కిచ్చి యప్పడుపు కూడుభుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల గౌధ్దాలికులైననేమి నిజదారసుతాదిక పోషణార్థమై.” అంటూ ఆనందంగా హలం దున్నుకున్న మహా కవి పోతన.
కవిసార్వభౌముడు శ్రీనాధుడు, పోతన సమకాలీకులని, దగ్గరి బంధువులనే ప్రచారం ఉంది. అయితే వాటికి తగిన చారిత్రక ఆధారాలు మాత్రం లేవు. ఈ వాదనలను సమర్థించే వారితో పాటుగా విభేదించే వారు కూడా ఉన్నారు. తన భాగవతం ద్వారా తెలుగు జాతికి ఒక అద్బుతమైన వారసత్వ సంపదను వదిలి వెళ్ళాడు పోతన.
(బి.వి.ఎల్.కే.మనోహర్)
(తెలుగు మహాసభను పురస్కరించుకుని తెలుగు కవులు, రచయితల గురించి ప్రత్యేక వ్యాసాలు ప్రచురించదలిచాము. మీరు కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకోండి మీ రచనలను మాకు telanganaheadlines.in కు గానీ 9100573018 నెంబర్ కు వాట్సప్ రూపంలో గానీ పంపవచ్చు.)