కేసీఆర్ ను కలిస్తే తప్పేంటి:పవన్ కళ్యాణ్

తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఆయన అక్కడి నుండి కరీంనగర్ కు చేరుకున్నారు. ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో ఉన్న సమస్యల గురించి సమగ్రమైన అధ్యాయనం చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణ పై పూర్తి అవగాహన ఉన్న అనేక మంది మేధావులు జనసేనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని అన్ని సమస్యలపై సమగ్రమైన అధ్యాయనం చేసిన తరువాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయనున్నట్టు ఆయన వివరించారు.
విధ్వంసకర రాజకీయాలు చేయడం తనకు నచ్చని విషయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్లను గురించి సీట్లను గురించి ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతీ అంశాలన్ని రాజకీయ కోణంలోనుంచే చూడాలనుకోవడం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయన్నారు. అటువంటి వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చడం ఎవరివల్లా కాదన్నారు.
తాను ఆంజనేయస్వామి భక్తుడినని ఆయనను నమ్ముకుంటే అసాధ్యాలు సుసాధ్యమవుతాయన్నారు. జనసేనతో కలిసి పనిచేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంలో తప్పేముందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తెలంగాణను సాధించిన వ్యక్తిగా ప్రజలు భావిస్తున్న కేసీఆర్ ను కలవడంలో తప్పులేదన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే ఆయన్ను కలిశానని అన్నారు. తనకున్న పరిమితులమేరకు కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన పనితీరుపై ఎక్కడా పెద్దగా అభ్యంతరాలు లేవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *