ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజమండ్రిలో ఆయన జనసేన సమన్యవకర్తతో మాట్లాడుతూ. పరకాల లాంటి వ్యక్తుల వల్లే ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినిందన్నారు. ఆయన్ను కమిట్ మెంట్ లేని వ్యక్తిగా అభివర్ణించారు. ప్రత్యేక హోదా గుంరించి కేంద్ర ప్రభుత్వాన్ని పరకాల ప్రభాకర్ కానీ ఆయన భార్య కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ కానీ ఎందుకు ప్రశ్నించరని పవన్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపన చిరంజీవికి బాగా ఉండేదని ఆయన చుట్టూతా ఉన్న కొంత మంది వ్యక్తుల వల్లే ఆ పార్టీ పూర్తిగా దెబ్బతినిందన్నారు. తాను చిరంజీవి అంత మంచి వాడినికాదన్నారు. ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న సమయంలో తాను మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయానన్నారు.
ముఖ్యమంత్రి అయితేనే పనులు చేస్తా అంటున్న కొంత మంది ప్రతికక్షంలో ఉండి కూడా ప్రజలకు మేలు చేయవచ్చని ఎందుకు ఆలోచించడంలేదో తనకు అర్థం కావడం లేదని అన్నారు. విపక్షంలోఉండి కూడా ప్రజలకు సేవ చేయవచ్చని ఆ విషయాన్ని ప్రతిపక్షం విస్మరిస్తోందన్నారు. తనకు కులాన్ని ఆపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ అన్నారు. తాను కుల రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందనే గత ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికానని ఇప్పుడు వాళ్లు పనులు చేయకుండా వాళ్లని కూడా నిలదీస్తానన్నారు. పదవుల కోసం అయితే తన వెంట రావద్దని ఆయన అభిమానులకు సూచించారు. సమాజాన్ని బాగుచెద్దాం అనే ఆలోచన ఉంటేనే తన వెంట నడవాలన్నారు.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.