పాస్ బుక్ తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి

తెలంగాణ లోని పట్టాదారు పాస్ బుక్ లన్నింటితోనూ ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భూముల వివరాలను ఖచ్చితంగా ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని లేని పక్షంలో వాటిని బినామీ భూములుగా గుర్తిస్తారని చెప్పారు. రైతులకు వ్యవసాయ భూమితో పాటుగా వ్యవసాయేతర భూమి ఉంటే వాటిని కూడా పాస్ పుస్తకాల్లో నమోదు చేయాలని సీఎం చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ప్రతీ విషయాన్ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. మార్చి 11వ తేదీనే పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వాల్సి ఉన్నందును హడావుడిలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలన్నారు.
కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వడానికి చకచకా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకోవాలని క్షేత్ర స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూరికార్డులను తెలంగాణలో ప్రక్షాళన చేసిన అధికారులను సీఎం అభినందించారు. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు భాద్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *