భారత్ తమకు పొగపెడుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. సరిహద్దుల్లోని రాజస్థాన్, పంజాబ్ లలో పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను కాలుస్తుంటారని దీని వల్ల వచ్చే పొగ తమ భూబాగంలోకి వచ్చి తమను తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ పాకిస్థాన్ వాపోతోంది. ఈ పొగ వల్ల తమ దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. వీటితో పాటుగా భారత్ లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల కూడా తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది.
భారత్ నుండి వచ్చే పొగ వల్ల సరిహద్దుల్లోని పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందికర వాతావరణం నెలకొందని పాకిస్థానీ అధికారులు అంటున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ ప్రజలు పొగ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. భారత్ నుండి పొగ తమ దేశంలోని వస్తోందని పొగతో పాటుగా పెద్ద ఎత్తున బూడిద తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పాకిస్థానీ వర్గాలు అంటున్నాయి. భారత్ లో గత రెండు రోజులుగా 2500 వరకు పంట వ్యార్థాలను తగులబెట్టడం ద్వారా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని వీటిని తమ ఉపగ్రహాలు గుర్తించాయని పాకిస్థాన్ అంటోంది. అదే సమయంలో తమ భూబంగంలో ఇదే తరహా ఘటనలు 30లోపే జరిగాయని అంటోంది.