ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీ ఉన్న నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) లో జరిగిన దారుణ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకారంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. బాయిలర్ పైపు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పేలుడు వల్ల వేడి ఇంధనం బయటకు వచ్చి కార్మికుల పై పడడంతో కొంత మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. బాయిలర్ పేలడంతో అత్యంత వేడి ఇంధనం ఒక్కసారిగా కార్మికులపై పడిందని వారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పేలుడు తరువాత పెద్ద ఎత్తున ఆవసించిన దుమ్ము వల్ల కూడా కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రమాదం వల్ల ప్రస్తుతం ప్లాంట్ ను తాత్కాలికంగా మూసేశారు. బాయిలర్ ఎందుకు పేలిందనే విషయంపై ఇంకా ఆధికారులు స్పష్టమైన కారణం చెప్పలేకపోతున్నారు. అత్యుతన్న భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఎన్టీపీసీ పేర్కొంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీపీసీ యాజమాన్యం ఇచ్చే ఎక్స్ గ్రేషియాకు ఇది అదనం. యూపీ మంత్రి మర్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాయ్ బరేలీ ప్రమాదం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా తమ పార్టీ కార్యకర్తలను సోనియా కోరారు.