అణుయుద్ధం జరుగుతుందంటూ ఉత్తర కొరియా మరోసారి హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఉత్తర కొరియా చేసిన అణు హెచ్చరికలు మరోసారి ప్రకంపనలు రేపుతున్నాయి. అమెరికా తన కవ్వింపు చర్యలు మానుకోకపోతే అణు యుద్ధం తప్పదంటూ ఉత్తర కొరియా ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో వ్యాఖ్యానించారు. అమెరికా యుద్ధ విమానాలు కొరియా ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టిన నేపధ్యంలో ఉత్తర కొరియా ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా తన ద్వంద విధానాలను మానుకోవాలని ఒక వైపు యుద్ధం వద్దంటూ మరో వైపు తమపై దాడికి అమెరికా ప్రయత్నాలు చేస్తోందని ఉత్తర కొరియా ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో పేర్కొన్నారు. అమెరికా తన విధానాలను మార్చుకోనంత వరకు తాము క్షిపణి పరీక్షలను ఆపేది లేదన్నారు.
అమెరికా తమ భూబాగంపై దాడి చేస్తే అమెరికాను నాశనం చేస్తాంటూ మరోసారి హెచ్చరికలు చేసిన ఉత్తర కొరియా అమెరికా మొత్తం తమ అణ్వాయుధాల పరిధిలోనే ఉందని చెప్తోంది. తమ భూబాగంపై ఒక్క అంగుళం లోనైనా దాడులు చేస్తే దానికి ప్రతిగా అమెరికా మొత్తాన్ని నాశనం చేస్తానంటూ ఉత్తర కొరియా హూంకరిస్తోంది. ఉత్తర కొరియా తాజా హెచ్చరికల నేపధ్యంలో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే భయం వ్యక్తమవుతోంది.