అవిశ్వాస తీర్మానం పై నేడూ జరగని చర్చ

కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే లోక్ సభ శుక్రవారానికి వాయిదా పడింది. గత ఐదు రోజులుగా ప్రతీరోజు అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రాకుండానే సభ వాయిదా పడుతూ వస్తోంది. గురువారం నాడు కూడా అదే పరిస్థితి. సభ ఆర్డర్ లో లేదని చెప్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానం పై ఎటువంటి చర్చ లేకుండానే సభను వాయిదా వేశారు.
లోక్ సభ ప్రారంభమయిన వెంటనే కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయగా రిజర్వేషన్లపై కోటాపై టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన జరిపారు. దీనితో సభను మద్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
సభ 12.00 గంటలకు సమావేశం అయిన తరువాత కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకుని వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశంపై చర్చించాల్సి ఉందని స్పీకర్ ప్రకటించినా సభ్యులు శాంతించలేదు.
అవిశ్వాస తీర్మానం తో సహా అన్ని విషయాలపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతకుమార్ ప్రకటించారు. సభను ముందుగా దారిలో పెట్టాలని దాని తరువాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి పేర్కొన్నారు. సభలో అతి ముఖ్యమైన విషయాలపై చర్చజరగాల్సి ఉందని సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలంటూ స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పోడియం వద్ద అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.
ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రకటించిన సభ్యులకు ఎంతమంది మద్దతు ప్రకటిస్తున్నారో అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందని, తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారి సంఖ్యను లెక్కించేందుకు వీలుకల్పించాలని స్పీకర్ వెల్ లోకి దూసుకుని వచ్చిన వారిని కోరారు. అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడానికి తనకు అవకాశం లేకుండా పోయిందని తాను సభ్యుల సంఖ్యను లెక్కించే స్థితిలో లేనని స్పీకర్ ప్రకటించి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
బీజేపీ ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం అవిశ్వాస తీర్మానం పై చర్చకు రాకుండా అడ్డుకుంటోందని తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. సభలో కొంత మంది సభ్యుల ఆందోళనలను సాకుగా చూపిస్తూ సభను వాయిదా వేసుకుని వెళ్లిపోతున్నారని వారు అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశంపై చర్చ జరిపే చిత్తశుద్ది ప్రభుత్వానికి కనిపించడం లేదనేది వారి వాదన.
ప్రభుత్వం పై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా ప్రతీ రోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే బీజేపీ సభను నడవనీయకుండా చేస్తోందని వారు అంటున్నారు. అన్ని విషయాలపై చర్చకు సిద్ధమని పైకి ప్రకటిస్తున్నా చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం తేటతెల్లం అయిందని తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
telugu desam, central government, bjp government,tdp, ycp, aiadmk, trs.