కొత్త సచివాలయం ఎందుకు కట్టోద్దు-సీఎం సూటి ప్రశ్న

దేశంలోనే అత్యద్భుతమైన రీతిలో నూతన సచివాలయం, శాసనసభ, శాసన మండలి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనాలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సచివాలయ, ఇతర భవనాల నిర్మాణాలపై శాసనసభలో జరిగిన చర్చ కు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. నూతనంగా నిర్మించబోయే భవనాలను అత్యంత సుందరంగా, ప్రణాళికా బద్దంగా నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం బాలేదని అంటూ దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదే అన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఏ మాత్రం ప్రణాళికా బద్దంగా లేదని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారే గందరగోళంగా ఉందన్నారు. ఇట్లాంటి సచివాలయాన్ని మార్చాలనే ఉద్దేశంలో కొత్త సచివాలయం ఇతర భవనాలు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు విమర్శించడం దారుణం అన్నారు. చెత్త సచివాలయంలోనే మనం కొనసాగుదామా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ భవనాలు కట్టేసీ సచివాలయాన్ని అడ్డదిదిడ్డంగా తయారు చేశారని సీఎం విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న సచివాలయంలో కనీసం ఒక్క భవనం కూడా నిబంధనల మేరకు కట్టింది లేదన్నారు. శాసనసభ కూడా సరిగా లేదని సభకు వచ్చే వారికోసం సరైన పార్కింగ్ వసతి లేదని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ నుండి శాసన మండలికి వెళ్లడానికి సరైన దారిలేదన్నారు. సచివాలయంలో కూడా అన్ని విభాగాలు ఒక దగ్గర కాకుండా ఒక్కో విభాగం ఒక్కో దగ్గర విసిరేసినట్టుగా ఉన్నాయన్నారు. సచివాలయంతో పాటుగా శాసనసభ, మండలికి కొత్త భవనాలను కట్టాల్సిన అసవరం ఉందని అన్నారు. సచివాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన బైసన్ పోల్ మైదానం క్రీడలకోసం ఉద్దేశించింది కాదని అది మిలటరీ వాళ్లదని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం ఒక్క సచివాలం నిర్మాణం తోనే హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ లాగా మారుతుందనే ప్రచారన్ని విపక్షాలు చేయడం ఎంతవరకు సబబని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సరైన అవగాహన లేకుండా విపక్షాలు ప్రవర్తిస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో క్రీడా మైదానాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 19 పెద్ద మైదానాలతో పాటుగా అనేక మైదానాలు అందుబాటులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *