గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన ఆస్తులను బినామీ ఆస్తులుగా గుర్తించే అవకాశాలున్నాయి. ఆస్తులకు సంబంధించిన వివరాలను అందచేయని పక్షంలో నయీంకు చెందిన ఆస్తులను బినామీ ఆస్తులుగా గుర్తిస్తామని బినామీ లావాదేవీల నిరోధక యూనిట్ తెలిపింది. నయీంకు సంబంధించి 26 చోట్ల 98 ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. అటు ఆదాయపు పన్ను శాఖ మారోసారి నయీం కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేసింది. నయీంకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించాలంటూ గతంలో ఒకసారి నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన ఐటి శాఖ ఈ మేరకు నోటీసులను నయీం ఇంటిపై అంటించింది. భూవనగిరి ఖిలానగర్ లో ఉన్న నయీం తల్లి తాహేరాబేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమాబేగం, తమ్ముడి భార్య హీనా కౌసర్, తమ్మడి కూతురు హాలియా బేగం పేర్ల మీదగా నోటీసులు జారీ అయ్యాయి.
భూవనగిరితో పాటుగా హైదరాబాద్, బీబీనగర్,యాదగిరిగుట్ట, నల్గొండ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.