నల్గొండలో కదం తొక్కిన ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ

తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కేజీ నుండి పీజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో భారీ సభ జరిగింది. విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఎన్నో సమస్యలకు ఓర్చి విద్యాసంస్థలను నడుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి కనీసం ఎటువంటి ప్రోత్సహకాలు కరువయ్యాయని వారు వాపోయారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని వారు పేర్కొన్నారు. కార్పేరేట్ కాలేజీల ఆగడాలను భరిస్తూ, వారి నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ అనేక కష్టాలకు గురువుతూ తక్కువ ఖర్చుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందచేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. తెలంగాణలో విద్యా కుసుమాలు పూయిస్తున్న తమను అనేక కష్టాలు వెన్నాడుతున్నాయని వారు చెప్పారు.
విద్యా సంస్థలను నడపడం ప్రస్తుత పరిస్థుల్లో తలకు మించిన భారంగా మారిందని దీనికి తోడు ప్రభుత్వం నుండి కూడా ఆశించిన మేరకు సహాయం లభించడం లేదని వారు ఆరోపించారు. మేము బతుకుతూ మరో 5 లక్షల మందికి ఉపాధి చూపిస్తున్న విద్యాసంస్థల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం విద్యాసంస్థలను నడపడం కష్టంగా మారిందని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ న్యూ భద్రుకా కళాశాల ప్రిన్సిపల్ నర్సింహ్మా గౌడ్ అన్నారు. కార్పోరేట్ కళాశాలల నుండి వస్తున్న పోటీతో పాటుగా వారు చేస్తున్న అనైతిక కార్యక్రమాలు, జిమ్మిక్కులకు ప్రజలు మోసపోతున్నారని చెప్పారు. అతి తక్కువ ఫీజులో తమ లాంటి వాళ్లు కళాశాలలను నిర్వహిస్తున్నా తమకు ప్రభుత్వం నుండి ప్రోత్సహం లేదని అన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రతీ సంవత్సరం విద్యా సంస్థను రెన్యూవల్ చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థలకు శాశ్వతంగా గుర్తింపు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీనితో పాటుగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆరోగ్య కార్డులు, డబుల్ బెడ్ రూంలతో పాటుగా గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రియబర్స్ మెంట్ ను వెంటవెంటనే చెల్లించాలని బకాయిల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు పేర్కొన్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా ట్యూషన్ ఫీజును పెంచాలని వారు డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు శేఖర్, ప్రసన్న జ్యోతి తదితరులు ప్రసంగించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *