హైదరాబాద్ లో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి హత్యకు గురయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం శేరిలంగంపల్లి ప్రాంతంలో అపర్ణ అనే మహిళ నివసిస్తోంది. స్థానికంగా ఒక మాల్ పనిచేస్తున్న ఆమెతో పాటుగా తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. అపర్ణ కు ఆరు సంవత్సరాల కూతురు ఉంది. భీమవరం ప్రాంతం నుండి దాదాపు పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చిన అపర్ణ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన మధు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే మధుకు పెళ్లయింది.
మధు మొదటి భార్యకు సంబంధించిన వారితో అపర్ణకు గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు మధు మొదటిభార్యతో పాటుగా ఆమె బంధువులు వచ్చి అపర్ణను బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అపర్ణతో పాటుగా అమె కూతురు, తల్లి కూడా హత్యకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఇంట్లో నుండి ఎవరూ బయటికి రాకపోవడంతో పాటుగా ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా మూడు మృతదేహాలు కనిపించాయి. క్లూస్ టీంతో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.