అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగురుతుంది:మురళీధర రావు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరనుందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు జోస్యం చెప్పారు. కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలన రావాల్సి ఉందన్నారు. ఇక్కటికే అధిక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని తాజాగా ఈ జాబితాలోకి హిమాచల్ ప్రదేశ్ కూడా వచ్చి చేరిందన్నారు. గుజరాత్ లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి ఆశలు ఫలించలేదన్నారు. కుల రాజకీయాలను అడ్డుపెట్టుకుని గుజరాత్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను అక్కడి ప్రజలు విజయవంతంగా తిప్పికొట్టారని అన్నారు. కుల, మతాలను అడ్డుపెట్టుకుని వంశపారంపర్యంగా పరిపాలించడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అలవాటనే అన్నారు. ఇటువంటి పోకడల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కర్ణటకలోనూ ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు గద్దెదింపుతారని అన్నారు.
అభివృద్దే నినాదంగా దూసుకుని పోతున్న బీజేపీని అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. చేసిన అభివృద్దిని చూపించి ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకే ఉందన్నారు. కుల, మత తత్వాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేసిన పార్టీలకు ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు.