అందరినీ కలుపుకుపోతూ…ప్రచారంలో దూసుకునిపోతూ…

0
54

దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్ గిరిలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు బీజేపీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ మల్కాజ్ గిరిని కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు ఇక్కడి నుండి బరిలోకి దిగారు. నియోజవవర్గం మొత్తం ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటుగా అన్ని వర్గాల ప్రజలను, నాయకులను కలుస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
నియోజకవర్గంలో పట్టున్న నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టడంలో ఎన్.రామచంద్రరావు సఫలం అయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ ను కలుసుకున్న బీజేపీ అభ్యర్థి ఆయన మద్దతును సంపాదించడంలో విజయం సాధించారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో గట్టి మద్దతుదాలున్న దేవేందర్ గౌడ్ మద్దతు కీలకమని అది ఖచ్చితంగా రామచంద్రరావుకు సహకరిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయని సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేవేందర్ గౌడ్ ను కలిసిన రామచంద్రరావు తనకు మద్దతుతెలపాల్సిందిగా కోరగా ఆయన అంగీకరించారని సమాచారం. పూర్తి స్థాయిలో తన సహాయసహకారాలు ఉంటాయని దేవేందర్ గౌడ్ చెప్పినట్టు తెలుస్తోంది.
మేధావిగా,అందరికీ అందుబాటులో ఉండే నేతగా పేరు పొందిన రామచంద్రరావు మల్కాజ్ గిరి స్థానం నుండి గెలుపొందడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ,సామాజిక అంశాలు ఆయనకు కలిసి వస్తాయని నియోజకవర్గంలో ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటుగా మోడీ అభిమానులు ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారని వారు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సహకారంతో గెల్చిన టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందిన చామకూర మల్లారెడ్డి కొద్ది కాలానికే టీడీపీని వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతిని ప్రజలు మర్చిపోలేదని, ప్రస్తుతం ఆయన అల్లుడూ టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నా ఓటర్లలో పెద్దగా దాని ప్రభావం లేదని బీజేపీ శ్రేణులంటున్నాయి.
తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని ఎన్.రాంచంద్ర రావు అంటున్నారు. నియోజక వర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని గతంలో ఎక్కడి నుండి గెల్చిన వారెవరి సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని ఆయన చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని వాటి పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన చెప్తున్నారు.
కూకట్ పల్లి , ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులలో చెరువుల కాలుష్యం, రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, కుత్బల్లాపూర్ పారిశ్రామల వాడలో కాలుష్యం, చిన్న చినుకులకు చిత్తడిగా మారుతున్న రోడ్లు, అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీ వ్యవవస్థ, పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేలీ వ్యవస్థ లేకపోవడం, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఏర్పాటు వంటి అనేక సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో గెల్చిన నేత ఒక్కసారి కూడా లోక్ సభలో మాట్లాడిన పాపానపోలేదని తాను మాత్రం స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో గళం విప్పుతానని చెప్పారు.
దేశం సుస్థీరంగా ఉండాలన్నా, ప్రతీ భారతీయుడు తల ఎత్తుకుని తిరగాలన్నా తిరిగి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఎన్.రామచంద్రరావు స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుని పోతోందని ఉపగ్రహాలను సైతం కూల్చేయగల శక్తిని సంపాదించుకోవడమో ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. గత పాలకుల మాదిరిగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలఒగ్గే పరిస్థితుల్లో భారత్ లేదని ఆ విషయాన్ని ప్రతీ ఒక్క భారతీయుడు గమనించారని అన్నారు. ఒక్క అవినీతి మరక లేకుండా దేశాన్ని ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేసిన మోడీ సర్కారు రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్తున్న ఎన్.రామచంద్రరావు ఇప్పటికే ప్రజలు మోడీ సర్కారును గెలిపించాలనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

Wanna Share it with loved ones?