కదం తొక్కిన మహారాష్ట్రా రైతులు-దిగివచ్చిన ప్రభుత్వం

నెత్తిన మండే ఎండ…వేడెక్కిన రోడ్ల భగభగలు… కాళ్లకు కనీసం సరైన చెప్పులు కూడా లేవు… తమ బతుకులు బాగుపడతాయనే ఆశ… ఇదే మహారాష్ట్ర రైతులను 180 కిలోమీటర్లు నడిపించింది. తమ సమస్యసల పరిష్కారం కోసం వామపక్ష రైతు సంఘం అఖిలభారత కిసాన్ సభ పిలపు మేరకు రైతులు కాలినడకన ముంబై బయలుదేరారు. చినుచినుకు ప్రవాహంగా మారినట్టు పదిహేను వేలమందితో ప్రారంభమైన వారి నడక 50వేలకు చేరుకుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తానుమాత్రం పస్తులు పడుకోవాల్సిన దుస్తితివచ్చినందుకు బాధపడుతూ జరిపిన నిరసన ప్రదర్శన అది. చిన్నా పెద్ద ముసలీ ముతకా ప్రవాహంగా ముందుకు సాగారు. రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తూ ఆరోరోజుకు మహారాష్ట్ర రాజధాని ముంబాయికి చేరుకున్నారు.
ముంబాయి అసెంబ్లీని ముట్టడించాలనేది రైతుల వ్యూహం. ముంబాయి మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు, పిల్లల పరీక్షలను దృష్టిలో పెట్టుకున్న రైతులు ముంబాయి శివార్లకు ఉదయం 7.00 గంటలకు చేరుకుని అక్కడే ఆగిపోయారు.
రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతుధరను ప్రకటించాలని, భారంగా మారిని రైతుల రుణాలు, విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని, రైతుల ప్రయోజనాల కోసం స్వామినాథన్ కమిటి చేసిన సిఫార్సులను అమలు చేయాలనేదే వారి డిమాండ్. వారివి గొంతెమ్మ కోరికలు ఏవీకావు. అసంబద్దమైనవి అంతకన్నా కాదు. వర్షాలు పడక, నీళ్లు లేక మహారాష్ట్రా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేసిన అప్పులు తలకుమించిన భారంగా మారడంతో వేలాది మంది రైతులు తనువుచాలిస్తున్నారు. రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా సరిగా అమలు జరగడం లేదు.
రైతులకు విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. తాము వారితో కలిసి పోరాటం చేస్తామని చెప్పాయి. అయితే ఉధ్యమానికి రాజకీయ రంగు మాత్రం పులమనీయని రైతులు తమ డిమాండ్ల సాధన కోసం తామే పోరాడతామన్నారు. ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం గాను వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనితో రైతులు తమ ఉధ్యమాన్ని ఉపసంహరించారు.
కమిటీలతో కాలయాపన చేయకుండా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పలువురు డిమాండ్ చేస్తున్నారు. 50వేల మంది ఉధ్యమం చేసినా ఏ చిన్న అవాఛంనీయ ఘటనా జరగలేదు. సుశిక్షుతులైన సైనికుల తరహాలో సాగిన రైతులు సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తాము కోరుకున్నది సాధించుకోగలికారు.
All India Kisan Sabha (AIKS), Communist Party of India-Marxist (CPM), protest march, Nashik, Maharashtra Assembly,Swaminathan Commission recommendations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *