హక్కులను కాలరాస్తే సహించం-లంబాడీల శంఖారావం

లంబాడీల హక్కులను కాలరేసుందుకు ఎవరు ప్రయత్నించినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని లంబాడీ నేతలు హెచ్చరించారు. లంబాడీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సరూర్ నగర్ మైదానంలో జరిగిన “లంబాడీల శంఖారావం” కార్యక్రమంలో పార్టీలతు అతీతంగా లంబాడీ నేతలు హాజరయ్యారు. తమ హక్కుల కోసం పోరాడతామని వారు స్పష్టం చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. శంఖారావానికి రాష్ట్రం నలుమూల నుండి తరలివచ్చిన లంబాడీల సమక్షంలో మాట్లాడిన నేతలు తమ హక్కులను ఎవరు కాలరాసేందుకు ప్రయత్నించినా పుట్టగతులుండవని హెచ్చరించారు.
లంబాడీలు ఆర్థికంగా బలపడ్డారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. నేటికీ 90 శాతం మంది లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా లంబాడీలే అనుభవిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వారు తప్పు బట్టారు. కావాలని లంబాడీలపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 400 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన లంబాడీలను పరాయి వారుగా ప్రచార చేయడం సమంజసం కాదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన లంబాడీలు సంవత్సరాలుగా వెనుకబడే ఉన్నారని చెప్పారు. ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని సమైఖ్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.