వానరాన్ని ఖననం చేసే విషయంలో రచ్చ- ఆధోనిలో ఉధ్రిక్తత

కర్నూలు జిల్లా ఆధోనిలో ఇరువర్గాల మధ్య స్వల్ప విషయమై జరిగిన వివాదం ఉధ్రిక్తతకు దారితీసింది. దీనితో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఆధోనిలోని హవన్న పేటలోని ఒక దేవాలయానికి ఒక వానరం నిత్యం వస్తుండేది. దానికి స్థానికులు ఆహారాన్ని అందిస్తుండడంతో అది దేవాలయ ప్రాగణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులకు మచ్చికగా ఉండేది. ఈ క్రమంలో సదరు వానరం మృతి చెందడంతో స్థానికంగా ఉన్న కొంత మంది దాన్ని దేవాలయానికి చెందిన స్థలంలో ఖననం చేసేందుకు చేసిన ప్రయత్నాలను మరో వర్గం వారు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వానరాన్ని ఖననం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. తమను అడ్డుకుంటే ఆత్మాహుతికి పాల్పడతామంటూ ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ వార్తా దావానలంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి జనాలు తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరో వైపు తమ మనోభావాలను పోలీసుల సహకారంతో మరో వర్గంవారు కించపర్చారంటూ సమాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎటువంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు చెప్తున్నారు. రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా రెచ్చగొట్టే చర్యలకు దిగితే ఊరుకునేది లేదని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *