పోరాటానికి ముందే పారిపోయిన విపక్షాలు:కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి విపక్షాలు బెంబేలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏంచేశారనే విషయాన్ని సభలో తమ నాయకుడు వివరిస్తారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది తమకు ముఖ్యంకాదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనేదే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమదే అధికారమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలపై కోర్టుకు పోతామంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పారోటానికి ముందే వారు అస్త్ర సన్యాసం చేసిన సంగతి బయటపడిపోయిందన్నారు.
లక్షల సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు సభకు చేరుకుంటున్నారని, దేశంలోనే ఇప్పటివరకు జగనంత భారీ స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఎక్కడ సభను నిర్వహించిన దాఖలాలు లేవని నభూతో అన్ని రీతిలో సభ జరుగుతుందని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున సభ జరుగుతున్నా ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఆదివారం నాడు, నగర శివార్లలో సభను నిర్వహిస్తున్నామన్నారు.
ప్రగతి నివేదన సభ పనుల పర్యవేక్షణకు గాను మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలకు మంత్రివర్గ సమావేశ హాజరు నుండి ముఖ్యమంత్రి మినహాయింపు ఇచ్చారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా మంత్రులు ప్రతీ చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.