అందరూ మావాళ్లే:కేటీఆర్

0
84

హైదరాబాద్ లో స్థిరపడన పూర్వపు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ప్రాంతానికి చెందిన వారికైనా ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాంపేటలో జరిగిన ‘మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్’ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ప్రాంతీయత అధారంగా తెలంగాణ ప్రభుత్వం ఎవరిపైనా ఎటువంటి విపక్ష చూపే ప్రశ్నే లేదన్నారు. ఎవరికీ అనుమానాలు అవసరం లేదని అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసినవి తప్ప ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి చేసినవి కాదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు వెతుకుతూ కొంత మంది అనవసరంగా ప్రజల్లో విషం నింపే చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
గతంలోనూ ఇటువంటి విఫపు ప్రచారాలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. 2014 ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆంధ్రులను భయపెట్టే ప్రయత్నాలు చేశారని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిని వారిని వెనక్కి పంపుతారని, వారి ఆస్తులను లాక్కుంటారని ప్రచారం చేశారని అయితే అవన్ని వట్టివేననే విషయం తమ పరిపాలనలో తేటతెల్లం అయిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మన పోలీసింగ్ వ్యవస్థ నేరాలను పూర్తిగా అదుపులో పెట్టగలిగిందన్నారు.
జాతీయ, ప్రాంతీయ రాజకీయాలపై ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని, తెలుగు ప్రజలకు గుర్తింపు తీసుకుని వచ్చిన ఘనత ఆయనదే అన్నారు. గతంలో తెలుగు ప్రజలను మదరాసీలుగా పిలిచేవారని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తెలుగు ప్రజలను దేశం మొత్తం గుర్తించిందన్నారు.
చంద్రబాబు అండచూసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ రెచ్చిపోతోందని, అన్ని రంగాల్లో దేశాన్ని, తెంలగాణ ప్రాంతాన్ని బ్రష్టు పట్టించిన ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను మళ్లీ తమకు అధికారాన్ని అప్పగించాలని అడుగుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు అధికార యావతప్ప సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్దిలేదని కేటీఆర్ విమర్శించారు.

Wanna Share it with loved ones?